వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు. తాను రాహుల్ అలా చేసినపుడు చూడలేదని చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీపై సంచలన కామెంట్స్ చేశారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, సభ నుంచి వెళ్లేటపుడు ఆయన తనను చూస్తూ ఫ్లయింగ్ కిస్ సైన్ చేశారని ఆరోపించారు. దీంతో 21 మంది మహిళా బీజేపీ సభ్యులు సంతకాలతో కూడిన లేఖను శోభా కరంద్లాజే.. స్పీకర్ ఛాంబర్‌లో సమర్పించారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు లేఖలో డిమాండ్ చేశారు. ఈ విధంగా డిమాండ్ చేసిన వారిలో హేమా మాలిని కూడా ఉన్నారు.
ఈ మొత్తం వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు హేమా మాలిని చిత్రంగా సమాధానం ఇచ్చారు. తాను రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పుడు చూడలేదని, ఆ ఘటన ఎప్పుడు ఎలా జరిగిందో కూడా తనకు తెలియదంటూ అందర్నీ ఆశ్చర్యపోయే జవాబిచ్చారు. అలాంటప్పుడు రాహుల్ గాంధీపై చర్యలకు ఉపక్రమించాలని ఎందుకు డిమాండ్ చేసినట్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం పార్లమెంటులో మణిపూర్ పై రసవత్తరమైన చర్చ కొనసాగుతుండగా.. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమే ఈ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని బీజేపీ సర్కార్ పై మండిపడుతున్నారు. ఇక మోదీ ఇంటిపేరు వ్యవహారంలో ఇటీవలే వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటు తొలగిపోయింది. దీంతో ఆయన లోక్ సభలోకి ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చారు.
