షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుంటే.. రోజుకు 5 వేల ఫైన్

షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుంటే.. రోజుకు 5 వేల ఫైన్

డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వీలైనంతగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగేలా చర్యలకు సిద్ధమైంది. యూపీఐ, కార్డ్ స్వైపింగ్ ద్వారా పేమెంట్స్ చేసేలా కస్టమర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా షాపులు, వ్యాపార సంస్థలు డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని కల్పించకపోతే భారీగా ఫైన్ వేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నిన్న (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి 1 నుంచి రోజూ 5 వేల ఫైన్

2020 జనవరి 31 లోపు డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కల్పించని వారు రోజుకు రూ.5 వేల చొప్పున ఫైన్ వేస్తామని సర్క్యూలర్‌లో హెచ్చరించింది. అయితే ఏటా కనీసం రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న షాపులు, వ్యాపారులకు మాత్రమే ఈ జరిమానాలు వర్తిస్తాయి.

జనవరి 31 లేదా అంతకన్నా ముందు డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కల్పించిన వాళ్లకు ఎటువంటి ఫైన్లు ఉండవు. ఫిబ్రవరి 1 నుంచి జరిమానాల మోత షురూ అవుతుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించేందుకు రూ.50 కోట్ల పైన టర్నోవర్ ఉన్నవారు డిజిటల్ పేమెంట్స్‌ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని  ఇన్‌కం ట్యాక్స్ చట్టంలో నిబంధనను చేర్చింది ప్రభుత్వం.

వ్యాపారులపై చార్జీలు ఉండవు

వ్యాపారులు ఈ విషయంలో వెనుకడుగు వేయకుండా వ్యాపారుల నుంచి బ్యాంకులు ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండా వెసులుబాటు కూడా కల్పించింది. భీమ్ యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్, ఆధార్ పే, కొన్ని రకాల డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ తీసుకునే వారికి ఈ అవకాశం సౌకర్యం ఉంటుందని జూలైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్‌లో చెప్పారు. వాస్తవాని అంతకు ముందు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) పేరుతో కస్టమర్ పే చేసే అమౌంట్‌ను బట్టి వ్యాపారి నుంచి స్వల్ప చార్జీలు వసూలు చేసేవి. 2020 జనవరి 1 నుంచి ఎండీఆర్ చార్జీలు రూ.50 కోట్ల టర్నోవర్ ఉంటే సంస్థల నుంచి వసూలు చేయబోమని గత శనివారం సీతారామన్ చెప్పారు.