చెంచల్ గూడ జైలు దగ్గర భారీ బందోబస్తు

హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్‎కు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అల్లు అర్జున్‎కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ 2024, డిసెంబర్ 13న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు అల్లు అర్జున్‎ను హైదరాబాద్‎లోని చెంచల్ గూడ సెంట్రల్‎ జైలుకు తరలిస్తున్నారు. 

 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కి సలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 2024, డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్‎లోని తన నివాసం వద్ద అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బన్నీని ఆయన నివాసం నుండి నేరుగా చిక్కడపల్లి పీఎస్‎కు తరలించారు. పోలీస్ స్టేషన్‎లో దాదాపు రెండు గంటల పాటు బన్నీని విచారించి అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. 

విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో వైద్యపరీక్షలు ముగిసిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.  అర్జున్‎ను చెంచల్ గూడ జైలుకు తరలిస్తుండటంతో  జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ALSO READ | పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్.. : అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే..

పెద్ద సంఖ్యలో బలగాలను చెంచల్ గూడ  పరిసరాల్లో మోహరించారు. జైలు పరిసరాల్లోకి ఇతరులను అనుమతించడం లేదు. జైలు వద్దకు పెద్ద ఎత్తున బన్నీ అభిమానులు చేరుకునే అవకాశం ఉండటంతో  జైలు వద్ద  రోజువారీగా ఉండే భద్రత, పోలీసు సిబ్బంది కంటే.. అదనంగా భద్రత బలగాలు మోహరించి సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు పోలీసులు.