నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్: వందల మంది పోలీసులతో భారీ భద్రత

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో స్టార్ హీరో అల్లు అర్జున్‎ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‎ను అతడి ఇంటి దగ్గర శుక్రవారం (డిసెంబర్ 13) ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా చిక్కడపల్లి పీఎస్‎కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‎లో కాసేపు విచారించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‎ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ బలగాలను మోహరించారు. బన్నీ అరెస్ట్ అయినట్లు తెలియడంతో అతడి అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పీఎస్, గాంధీ ఆసుపత్రి దగ్గరికి వెళ్లారు. 

ALSO READ | గాంధీ ఆస్పత్రిలో భారీ బందోస్తు : అక్కడే అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు

బన్నీని నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారని తెలియడంతో అక్కడికి కూడా బన్నీ ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు బన్నీకి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా..? లేక జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.