తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ... పుణ్య స్నానాలు చేసి దీపాలు వదిలిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు కిటకిటలాడాయి.  కార్తీకమాసం... సోమవారం... ( నవంబర్​ 27)  పౌర్ణమి శోభను సంతరించుకుంది.  శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల సందడి చేశారు.  ప్రత్యేక అభిషేకాలు చేస్తూ.. కార్తీక దీపాలను వెలిగించారు.  శివనామస్మరణ ఆలయాల్లో మారుమ్రోగింది.  పుణ్య నదుల్లో స్నానం చేసి భక్తులు  నదుల్లో కార్తీక దీపాలు వదిలారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తెలంగాణలోని వరంగల్, అన్నవరం, ద్వారకాతిరుమలలోని భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీరంగూడలోని ప్రముఖ దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా భక్తులు కార్తీక పూర్ణిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.   మల్లికార్జున స్వామికి సంప్రోక్షణ నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో కూడా కార్తీక మాసంలో ఆలయాలన్నీ కళకళలాడాయి.హనుమకొండ రుద్రేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్ర స్వామి, అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో నిల్చుని దీపపూజలు చేశారు.

కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, భద్రాచలంలోని గోదావరి, విజయవాడలోని కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.సోమవారం కార్తీక పూర్ణిమ కావడంతో అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో ఉపవాస దీక్షలు చేసేందుకు భక్తుల్లో పోటీ నెలకొంది. పిఠాపురం పాదగయ ప్రాంతంలోని శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడ పాదగయ పుష్కరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి ఘాట్లలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలోని మార్కండేయ స్వామి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పంచారామ ప్రాంతంలోని ద్రాక్షారామం, కోటిపల్లి మురుమళ్ల ముక్తీశ్వరుడు క్షణముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి