- యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీకి వరద ముప్పు
- గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, యూపీలోనూ వర్షాలు
మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వరదలకు కార్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో రెండు రోజుల్లో 17మంది చనిపోయారు. ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. యూపీలో మూడు రోజుల్లో మొత్తం 34 మంది చనిపోయారు. ఈస్ట్, సెంట్రల్ రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, లోతట్టు ప్రాంతాలు, హాస్పిటల్స్ జలమయం అయ్యాయి.
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలకు కార్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు చనిపోవడంతో రెండు రోజుల్లో మృతుల సంఖ్య 17కి చేరిందని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. 200 మందికి పైగా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో మాట్లాడి హిమాచల్‌లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్పారు. సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
హిమాచల్‌లో విరిగిపడ్తున్న కొండ చరియలు
హిమాచల్ ప్రదేశ్ మనాలీలో వరదలో చిక్కుకుపోయిన 20 మందిని రెస్క్యూ చేశారు. సోమవారం తెల్లవారుజామున సిమ్లాలోని థియోగ్ సబ్ డివిజన్లోని పల్లవి గ్రామంలోని ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు చనిపోయారు. భారత వాతావరణ శాఖ సోమవారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. సట్లెజ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. అంబాలా– యమునా నగర్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. 27 మంది ప్రయాణికులను క్రేన్, తాడు సాయంతో స్థానికులు రక్షించారు.
రాజస్థాన్‌లోని హాస్పిటల్స్‌లోకి వరద నీరు
ఈస్ట్, సెంట్రల్ రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, లోతట్టు ప్రాంతాలు, హాస్పిటల్స్ జలమయం అయ్యాయి. మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. జైపూర్‌లోని మురళిపురా ఏరియాలో ఏడేండ్ల బాలుడు డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. సిరోహి, అజ్మీర్, కరౌలి, జైపూర్, భరత్పూర్, ఉదయ్‌పూర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సిరోహిలోని మౌంట్అబులో 24 గంటల్లో 23 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ హాస్పిటల్, అజ్మీర్‌లోని జేఎల్ఎన్ హాస్పిటల్లో వరద నీరు చేరింది.
యూపీలో మొత్తం 34 మంది మృతి
యూపీలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది. మూడు రోజుల్లో మొత్తం 34 మంది చనిపోయారు. వీరిలో 10 మంది గడిచిన 24 గంటల్లో మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
పంజాబ్, హర్యానాలోనూ కుండపోత
పంజాబ్, హర్యానాను కూడా వానలు ముంచెత్తున్నాయి. 13వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మూడు రోజులుగా చండీగఢ్‌లోనూ కుండ పోత వర్షం కురుస్తున్నది. మోహాలీ, రూప్‌నగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను సీఎం భగవంత్‌మాన్ పరిశీలించారు. భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మోహాలీ, పటియాలా, ఫతేఘర్ సాహిబ్, పంచకుల, అంబాలా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. రాజ్‌పురాలోని హాస్పిటళ్లలోకి వరద నీరు చేరింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులపై చర్చించారు.
గుజరాత్లో 37 రిజర్వాయర్లకు హై అలర్ట్
గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 37 రిజర్వాయర్లకు అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ 58శాతం నిండింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 206 రిజర్వాయర్లలో 26 పూర్తిగా నిండాయి.
వార్నింగ్ మార్క్ దాటిన యమునా..ఢిల్లీకి పొంచి ఉన్న వరద ముప్పు
భారీ వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందనే ఆందో ళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి యమునా నదీ ప్రవాహం 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటుతుందని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యుసీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే అధికారులతో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టు కునే లా పటిష్ట చర్యలు చేపడ్తామని వివరించారు. ‘‘ప్రజలకు సాయం అందించేందుకు అంతా కలిసి పని చేయా లి. యమునా నది నీటిమట్టం 206 మీటర్లు దాటితే నది పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తాం” అని తెలిపారు. ఢిల్లీలో వరదలు సంభవించే పరిస్థితులు ఇప్పటకైతే లేవని నిపుణులు అంచనా వేస్తున్నారన్నారు. నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నామని, కుంగిన రోడ్లను వెంటనే పూడుస్తున్నామని చెప్పారు.
మంత్రులతో మోదీ రివ్యూ
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలపై ప్రధాని మోదీ సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో ప్రభావితమైన రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రోడ్లు, రైల్వే లైన్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, వర్షాల కారణంగా చనిపోయిన వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. హిమాచల్ సీఎంతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
