దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలపై భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. పలు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో వర్ష బీభత్సంతో నీటి, విద్యుత్ సరఫరాకు అంతారాయం ఏర్పడింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి భారీ చెట్లు, కరెంటు స్తంబాలు నెలకొరుగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. 24 గంటల వ్యవధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోడ కూలి ఏడుగురు మరణించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్ సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. చెట్లు, కరెంటు స్తంభాలు కూలడంతో సహా పలు ఘటనల్లో రాష్ట్రంలో 64 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 52 జిల్లాలకు గాను, 33 జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో మొత్తం 27 జిల్లాలు, 236 గ్రామాలపై ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడిందని అధికారులు పేర్కొన్నారు. గడ్చిరోలి, పూణే, నాసిక్ జిల్లాలో ఎక్కువగా ఉందని తెలిపారు. గడ్చిరోలి జిల్లాలో 130 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాలతో చాలా మంది చనిపోయారని, లక్షలాది మంది నిరాశ్రులయ్యారని తెలుస్తోంది.
