ఉమ్మడి పాలమూరులో భారీ వర్షం.. పొంగిపొర్లుతోన్న దుందుభి వాగు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.  దీంతో జిల్లాలోని దుందుభి వాగు ఉప్పొంగి ప్రవాహిస్తోంది. తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుబి నది పొంగిపొర్లడంతో పొరుగు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పక్క ఊరికి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి రావడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. భారీగా వర్షాలు పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి అని.. ఇకనైనా దుందుబి వాగు పై నుండి బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

లేదంటే వర్షం పడిన ప్రతిసారి పొరుగు గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మహబూబ్ నగర్ జిల్లాలోనూ భారీ వర్షం కురింది. దీంతో కౌకుంట్ల మండలంలోని ఇస్రాంపల్లి, కౌకుంట్ల గ్రామాల మధ్య బ్రిడ్జి పై నుండి వరద పారుతుండటంతో ఇస్రాంపల్లి  గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మరి కొన్ని ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది.