నీటితో నిండిపోయిన టెంట్లతో అవస్థలు
తడిచిపోయిన చద్దర్లు, బట్టలు, కట్టెలు
వంట చేసుకునేందుకూ కష్టాలు
ఒకవైపు తీవ్రమైన చలి, మరోవైపు జోరు వాన.. అయినా ఢిల్లీలో రైతులు ఏ మాత్రం పట్టు సడలకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తడిసిన టెంట్ల కిందే వణుకుతూ తలదాచుకుంటున్నారు. బట్టలు, చద్దర్లు, కట్టెలు పూర్తిగా తడిసిపోయాయి. ఢిల్లీలో ఇంకా రెండు మూడు రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: వాన నీటితో నిండిపోయిన టెంట్లు.. నానిపోయిన దుప్పట్లు, కట్టెలు.. తీవ్రమైన చలి.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతుల పరిస్థితి ఇది. రాత్రి నుంచి కురిసిన వానకు వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరంతరాయంగా వర్షం పడటంతో చాలా ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసుకున్నప్పటికీ అవి అంతగా సాయపడలేదని రైతులు చెప్పారు. ‘‘సఫ్దార్ జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో 25 మిల్లీమీటర్ల వాన పడింది. పాలం అబ్జర్వేటిరీలో 18 మిల్లీమీటర్లు కురిసింది. 6వ తేదీ దాకా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బురారీ గ్రౌండ్లోని రైతుల క్యాంపుల్లోకి కూడా వాన నీరు చేరింది. రైతులు తమ వస్తువులు తడిచిపోకుండా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రభుత్వానికి మా కష్టాలు కనిపించడం లేదు
‘‘రైతులు ప్రొటెస్టు చేస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. వాన ఆగిన తర్వాత చలి విపరీతంగా పెరిగింది. కానీ ప్రభుత్వానికి మా కష్టాలు కనిపించడం లేదు” అని ఫార్మర్ లీడర్, సంక్యుక్త్ కిసాన్ మోర్చా సభ్యుడు అభిమన్యు కోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనులు చేపట్టకపోవడంతో టెంట్లలోకి నీళ్లు వచ్చాయి. అయినా ఈ సమస్యలు రైతుల స్ఫూర్తిని దెబ్బతీయలేవు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే.. మా డిమాండ్లు నెరవేరే వరకు ఢిల్లీ బార్డర్ల నుంచి కదిలేది లేదు” అని సింఘు బార్డర్లో ఆందోళనల్లో పాల్గొంటున్న గుర్విందర్ సింగ్ చెప్పారు. ‘‘మా బట్టలు, చద్దర్లు, కట్టెలు తడిచిపోయాయి. చలి చంపేస్తోంది. వంట చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మా దగ్గర ఎల్పీజీ సిలిండర్. కానీ అందరి దగ్గరా సిలిండర్లు లేవు” అని వీర్పాల్ సింగ్ చెప్పారు.
