కరోనా వ్యాక్సిన్‌ కోసం పోటాపోటీ

కరోనా వ్యాక్సిన్‌ కోసం పోటాపోటీ

మన దేశం నుంచి రేసులో 7 కంపెనీలు

ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్‌ స్టార్ట్‌‌

ఏడాది చివరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి

గ్లోబల్‌ ఇన్ స్టిట్యూషన్లు, ఫార్మా కంపెనీలతో దోస్తీ

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌‌ను కనిపెట్టడం కోసం కనీసం ఏడు ఇండియన్‌‌ ఫార్మా కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గ్లోబల్‌‌ ఇనిస్టిట్యూషన్‌‌లతో కలిసి కొన్ని కంపెనీలు వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ స్టార్ట్ చేయగా, మరికొన్ని ఇండియన్ ఇనిస్టిట్యూషన్లతో కలిసి పనిచేస్తున్నాయి. భారత్ బయోటెక్‌‌, సీరమ్‌‌ ఇనిస్టిట్యూట్‌‌, జైడస్‌‌ కాడిలా, పానేసియా బయోటెక్‌‌, ఇండియన్‌‌ ఇమ్యునలాజికల్స్‌‌, మైన్వాక్స్‌‌,  బయోలాజికల్‌‌– ఈ  వంటి ఇండియన్‌‌ కంపెనీలు వ్యాక్సిన్‌‌ వేటలో ఉన్నాయి. సాధారణంగా వ్యాక్సిన్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల టైమ్‌‌ పడుతుంది. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడంతో తొందరగా వ్యాక్సిన్‌‌ తీసుకురావాలని సైంటిస్టులు కృషిచేస్తున్నారు.  డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌ను నాలుగు స్టేజ్‌‌లలో టెస్టింగ్‌‌ చేస్తారు. మొదట జంతువుల మీద ప్రీ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ చేస్తారు. వ్యాక్సిన్‌‌ సేఫ్టీ, ఇమ్యునిటీ రెస్పాన్స్‌‌ గురించి తెలుసుకోవడానికి తక్కువ మంది మనుషుల మీద ఫేజ్‌‌ 1 ట్రయల్స్‌‌ చేస్తారు. ఫేజ్‌‌ 2 లో ఈ సేఫ్టీ ట్రయల్స్‌‌ను మరింత మెరుగుపరుస్తారు. వ్యాక్సిన్‌‌ సామర్ధ్యాన్ని నిర్ధారించుకోవడానికి ఫేజ్‌‌ 3 లో వేల మందిపై ఈ వ్యాక్సిన్‌‌ను వాడతారు.

ఫేజ్‌‌ 1,2 ట్రయల్స్‌కు భారత్‌‌ బయోటెక్‌‌

భారత్‌‌ బయోటెక్‌‌ డెవలప్‌‌ చేసిన కోవ్యాక్సిన్‌‌కు ఫేజ్‌‌ 1, ఫేజ్‌‌ 2 ట్రయల్స్‌‌కు ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చాయి. ఈ వ్యాక్సిన్‌‌ను హైదరాబాద్‌‌ ప్లాంట్‌‌లో కంపెనీ డెవలప్‌‌ చేసింది. గత వారం హ్యూమన్‌‌ ట్రయల్స్‌‌ను కూడా ఈ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇండియన్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ రిసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌‌‌‌), నేషనల్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ వైరాలజీ(ఎన్‌‌ఐవీ)తో కలిసి ఈ వ్యాక్సిన్‌‌ను భారత్ బయోటెక్‌‌ డెవలప్‌‌ చేసింది.

వచ్చే ఏడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌‌: జైడస్‌‌ కాడిలా

ఫార్మా కంపెనీ జైడస్‌‌ కాడిలా కూడా కరోనా వ్యాక్సిన్‌‌ జైకోవిడ్‌‌ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ను జరుపుతోంది. వీటిని వచ్చే ఏడు నెలల్లో పూర్తి చేయాలని చూస్తోంది.  హ్యూమన్‌‌ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ను కంపెనీ గత వారం ప్రారంభించింది. క్లినికల్ ట్రయల్స్‌‌లో వ్యాక్సిన్‌‌ బాగుంటే, హ్యూమన్‌‌ ట్రయల్స్‌‌ పూర్తి చేసి, వ్యాక్సిన్‌‌ను తీసుకురావడానికి ఇంకో ఏడు నెలల టైమ్ పడుతుందని జైడస్‌‌ కాడిలా చైర్మన్‌‌ పంకజ్‌‌ ఆర్‌‌‌‌ పాటిల్‌‌ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో చెప్పారు.

విదేశీ కంపెనీలతో కలిసి వ్యాక్సిన్‌‌…

కరోనా వ్యాక్సిన్‌‌ డెవలప్‌‌ చేయడానికి అమెరికా కంపెనీ రెఫానాతో కలిసి ఐర్లాండ్‌‌లో ఓ జాయింట్ వెంచర్‌‌‌‌ను ఏర్పాటు చేశామని పానాసియా బయోటెక్‌‌ జూన్‌‌లో  ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా సుమారు 500 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌‌లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 40 మిలియన్‌‌ డోస్‌‌లను వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకొస్తామని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌‌ డెవలప్‌‌ చేయడం కోసం  ఇండియన్‌‌ ఇమ్యూనలాజికల్స్‌‌ (ఎన్‌‌డీడీబీ సబ్సిడరీ)  ఆస్ట్రేలియా యూనివర్శిటీ గ్రిఫిత్‌‌తో భాగస్వామ్యమయ్యింది. మైన్వాక్స్‌‌, బయోలాజికల్‌‌ – ఈ వంటి కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్‌‌ను డెవలప్‌‌ చేస్తున్నాయి.

ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌‌: సీరమ్‌‌

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌‌ను తీసుకొస్తామని లీడింగ్‌‌ వ్యాక్సిన్‌‌ తయారీ కంపెనీ సీరమ్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ చెబుతోంది. ‘ప్రస్తుతం ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్శిటీ డెవలప్‌‌ చేసిన ఆస్ట్రాజెనికా ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్‌‌ కోసం పనిచేస్తున్నామని ఈ కంపెనీ పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌‌ ఫేజ్ 3 క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ కూడా జరుగుతున్నాయి. ఇండియాలో వచ్చే నెలలో ఈ వ్యాక్సిన్ హ్యూమన్‌‌ ట్రయల్స్‌‌ను చేపడతామని సీరమ్‌‌ చెబుతోంది. క్లినికిల్‌‌ ట్రయల్స్‌‌ రిజల్ట్స్‌‌, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది చివరి నాటికి ఆస్ట్రాజెనికా ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇండియా సీఈఓ అదర్‌‌‌‌ పూనావాలా అన్నారు.  దీంతో పాటు అమెరికాకు చెందిన బయోటెక్‌‌ కంపెనీ కోడజెనిక్స్‌‌తో కలిసి ఓ వ్యాక్సిన్‌‌ను సీరమ్‌‌ డెవలప్ చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌‌ ప్రీ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ను 1 బిలియన్‌‌ డోస్‌‌లను తయారు చేయడానికి సీరమ్‌‌ ఇనిస్టిట్యూట్‌‌, ఆక్స్‌‌ఫార్డ్‌‌ యూనివర్శిటీతో భాగస్వామ్యమయ్యింది.