రాష్ట్ర అప్పులపై భట్టి వర్సెస్ హరీష్ రావు.. వాడీవేడిగా నడిచిన డిబేట్..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలో భాగంగా అసెంబ్లీలో వాడీవేడి చర్చ నడిచింది. రాష్ట్ర అప్పులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నట్లుగా నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష కోట్ల అప్పు చేసిందని హరీష్ అన్నారు. తొలి ఏడాదిలోనే  రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇదే కొనసాగితే ఐదేండ్లలో అప్పుల్లో మమ్మల్ని మించిపోతారని విమర్శించారు. భూములను కుదువ పెట్టి అప్పులు చేయాలని  బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా లేదా అని ప్రశ్నించారు. రూ.75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములను అమ్మేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. 

తాము అప్పు చేశామని పదే పదే అంటున్నారని, తమ అప్పు కేవలం రూ.4.14 లక్షల కోట్లేనని ఈ సందర్భంగా అన్నారు. కరోనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నామని, రూ.39 వేల కోట్లు కరోనా సమయంలో అప్పు తీసుకున్నామని తెలిపారు. కరోనా వల్ల,  కేంద్ర వైఖరి వలన ఆదాయం తగ్గిందని, అందుకోసం కొంత అప్పు చేయాల్సి వచ్చిందని అన్నారు. అదే విధంగా గత ప్రభుత్వం తమకు రూ.70 వేల కోట్ల అప్పు ఇచ్చిందని,  అది తమ ఖాతాలో ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ తీసేస్తే తాము చేసిన అప్పు కేవలం రూ.4.14 లక్షల కోట్లేనని తెలిపారు.

ALSO READ | ఔటర్ రింగు రోడ్డు టెండర్లపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తాము  దిగిపోయే నాటికి రాష్ట్ర ఆదాయం రూ.1.53 లక్షల కోట్లు ఉందని హరీష్ రావు అన్నారు. రెవెన్యూ రాబడి, వ్యయం పరంగా చూస్తే తాము కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్నే ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.2.96 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కు అప్పగించామని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఐదేళ్లలోనే 7 లక్షల కోట్లు మించి పోతుందని ఎద్దేవా చేశారు. అప్పులపై తాను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.

హరీష్ రావు లెక్కలను తప్పుబట్టిన భట్టీ..

హరీష్ రావు లెక్కలను తప్పబట్టిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ కే చెల్లిందని అన్నారు. తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం కట్టిన అప్పే రూ.1 లక్షా 18 వేల కోట్లు  అయితే మళ్లీ లక్ష కోట్ల అప్పు చేశామనటం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా అడ్డగోలుగా ఖర్చు చేయలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో ఎప్పుడైనా లక్ష18 వేల కోట్ల అప్పు కట్టారా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు అప్పు తెచచుకోవడం.. దోచుకోవడం.. తినడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్ర అప్పు 6 వేల కోట్లే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.

అంతకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చలో భాగంగా లెక్కలను వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పులపై మాజీ మంత్రి అనేక ఆరోపణలు చేశారని, ఆర్బీఐ రిపోర్టును చూపిస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మీ స్కీంతో ఆర్టీసీని గాడిలో పెట్టామని, బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నామని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏఏ సంక్షేమ పథకాలపై ఎంత ఖర్చు చేశారో ఆయన వివరించారు.

దుబారా కాదు.. సంక్షేమమే.. డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన లెక్కలివి:
* పంటల బీమాపై రూ.1514 కోట్లు
* ఫ్రీ బస్సు స్కీంపై రూ.1375 కోట్లు
*  కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.2311 కోట్లు
* గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.442 కోట్లు
* రుణమాఫీకి రూ.20,600 కోట్లు 
* 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు రూ.1234 కోట్లు
* సాగు రంగంపై రూ.11,140 కోట్లు
* రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.800 కోట్లు