కడపలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్.. పీక్స్ కి చేరిన కుర్చీపోరు

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్ సురేష్ బాబుల మధ్య కుర్చీ కేటాయింపు వివాదం గురించి తెలిసిందే.. ఇవాళ ( డిసెంబర్ 23, 2024 ) జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసారి కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ కేటాయించకపోవటం కౌన్సిల్లో వైసీపీ, టీడీపీ కార్పోరేటర్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తనకు కుర్చీవేయకుండా కేవలం మేయర్ కు మాత్రమే వేయడంతో నిరసనకు దిగారు మాధవి రెడ్డి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కౌన్సిల్ సమావేశంలో రచ్చకు దారి తీసింది.

గతంలో కూడా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయకపోవడం వివాదానికి దారి తీసింది.ఇరువర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో మహిళలను మేయర్ అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగటంతో సభలో గందరగోళం నెలకొంది. 

Also Read :- క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ

ఇదిలా ఉండగా.. మాధవీరెడ్డి మేయర్ సురేశ్ బాబు భార్యకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించటం చర్చనీయాంశం అయ్యింది. మేయర్ సురేష్ భార్య జయశ్రీని ఉద్దేశించి హూ ఈజ్ కె.జయశ్రీ అంటూ కడపలో ఫ్లెక్సీలు వెలిశాయి. జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని, నాలుగు ఫ్లోర్లు కట్టారంటూ మరో ఫ్లెక్సీ కూడా పెట్టించారు ఎమ్మెల్యే. కార్పోరేషన్ అధికారులకు ఇది కనిపించలేదా అంటూ ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నించారు మాధవి రెడ్డి.