హైదరాబాద్: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య వాగ్యుద్ధం జరిగింది. తనపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడాన్ని భట్టి తప్పుపట్టారు. తాను అప్పుల లెక్కలన్నీ కరెక్టుగానే చెప్పానని అన్నారు. అధికారం పోయాక బీఆర్ఎస్ నేతలకు మతిపోయిందని విమర్శించారు. సభను హరీశ్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లు చేసిన అప్పులకు మిత్తీల కిందే 66 వేల కోట్లను కట్టామని వివరించారు. వాళ్లు అన్ని బిల్లులు పెడింగ్‌లో పెట్టి వెళ్లారని మేమే కడుతున్నామని భట్టి చెప్పారు.
తాము ఎఫ్ఆర్ ఎంబీ పరిమితిని దాటి అప్పలు చేయలేదని భట్టి చెప్పారు. తాము అప్పులు చేసిన టీఆర్ఎస్ నేతలు చేసిన బకాయిలు తీర్చుతున్నామని క్లారిటీ ఇచ్చారు. రూ. 40 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయారని, తాము ఇప్పటి వరకు 14 వేల కోట్లను చెల్లించామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రూపొందించిన రూల్స్ బుక్ ను వారే పాటించడం లేదని భట్టి అన్నారు. బీఏసీ మీటింగ్ లో కాగితాలు పారేసి వెళ్లారని చెప్పారు. హరీశ్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదని, ఆయన ప్రతిదీ రాజకీయం చేస్తారని ఆరోపించారు.
ఇదేం ప్రవిలేజ్ మోషన్
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుపేద కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం.. ఆఖరుకు దీనిని కూడా ప్రివిలేజ్ మోహన్ అంటున్నారని భట్టి మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేస్తే ప్రివిలేజ్ మోహన్ ఇస్తారా..? అని ప్రశ్నించారు. తాము చెప్పిన అప్పులన్నీ కరెక్టేనని భట్టి అన్నారు.
ఏడాదిలో రూ. 1,27,208 కోట్ల అప్పు: హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ. 1,27,208 కోట్లు అప్పు తీసుకుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఈ సర్కారు ఎఫ్ఆర్ఎంబీ కింద చేసిన అప్పు రూ. 51 వేల 277 కోట్లేనని వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులన్నీ కలిపితే రూ. 1,27,208 కోట్లు అవుతుందని అన్నారు. అంటే ఐదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అప్పుడు 6,36,400 కోట్లు ఉండబోతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు రూ. 4 ,17,496 కోట్లు మాత్రమేనని అన్నారు. దీనిపై హౌస్ లో స్పెషల్ డిబేట్ పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పు శ్వేత పత్రంలో 6,71,757 కోట్లు అన్నారని, బహిరంగ సభల్లో సీఎం ఏడు లక్షల కోట్లు అంటున్నారని అన్నారు. నోటికొచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఏసీలో పెట్టకుండా రెండు బిల్లులను సభలో పెట్టారు అని మాత్రమే తాము అన్నామని చెప్పారు. భట్టి విక్రమార్క గారిపై ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో స్పీకర్ గారు క్లారిఫై చేయాలని కోరారు.