న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో సంచల నం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పలువురు రాజకీయ నేతల పాత్ర ఉందని, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమని 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ ఎం.ఎం సుంద్రేశ్, జస్టిస్ అర్వింద్ కుమార్లతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది.
ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూత్రా అనారోగ్యం కారణంగా హాజరుకాలేక పోతున్నట్లు ఆయన తరఫు అడ్వకేట్లు బెంచ్ దృష్టికి తెచ్చారు. అందువల్ల విచారణ వాయిదా వేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్ పిటిషన్పై విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
