అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా పడింది. 2024, డిసెంబర్ 30వ తేదీకి విచారణను వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను కోర్టు ఆదేశించింది. 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. 

తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను ఏ11 ముద్దాయిగా చేర్చారు  చిక్కడపల్లి పోలీసులు. ఈ కేసులో డిసెంబర్ 13న హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసును సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించాడు. 

హైకోర్టు అల్లు అర్జున్‎కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో బన్నీ జైలు నుండి విడుదల అయ్యాడు. ఈ కేసులో రెగ్యులర్ నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని బన్నీకి హై కోర్టు సూచించింది. ఈ మేరకు అల్లు అర్జున్ శుక్రవారం (డిసెంబర్ 27) నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్‎పై విచారణ జరగగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసుల తరుఫు పీపీ సమయం కోరారు. 

దీంతో బన్నీ బెయిల్ పిటిషన్‎పై కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో బన్నీ వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన తరుఫు లాయర్లు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు.