మయోనీస్ అంత డేంజరా ? ఒక్కసారి తింటే ఏం జరుగుతుంది..?

షవర్మా, బర్గర్, పిజ్జా, శాండ్​విచ్​, సలాడ్స్, ఫ్రెంచ్​ ఫ్రైస్, కబాబ్స్​.. వీటన్నింటికీ అదిరిపోయే కాంబినేషన్ ఏదంటే.. మయోనీస్​ అంటారు చాలామంది. నిజానికి ఇది ఎక్కడినుంచి వచ్చిందో కూడా దాన్ని ఇష్టపడేవాళ్లకు తెలియకపోవచ్చు. కానీ, ఎక్కువ మొత్తంలో మయోనీస్​ను లాగించేస్తున్నారు ఫుడ్ లవర్స్. అయితే... అంతగా ప్రభావం చూపిన ఈ రెసిపీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రెండింగ్​ ఫుడ్​ ఐటెమ్స్​లో మయోనీస్​ టాప్​లో ఉంది. మనదేశంలోనే కాదు ప్రపంచమంతటా దీన్ని ఇష్టపడుతున్నారు.

మయోనీస్​ పుట్టుక

1756లో బ్రిటీష్​, ఫ్రెంచ్​ నౌకాదళాల మధ్య జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ గెలిచింది. మినోర్కా అనే స్పానిష్​ ఐలాండ్​లోని మహోన్​ అనే పోర్ట్​ను కైవసం చేసుకుంది. దాంతో డ్యూక్​ డె రిచెలియు (ఇది ఫ్రెంచ్​ ప్రభువుల బిరుదు) తమ వాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆ విందు కోసం డ్యూక్​ దగ్గర ఉండే చెఫ్ కొత్త రెసిపీ ట్రై చేశాడు. అయితే, ఇందులో రెండు వెర్షన్లు ఉన్నాయి.

లోకల్​ సాస్​ని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఆలివ్​ ఆయిల్, గుడ్డు సొన, నిమ్మరసం కలిపి దానిలాగానే ఉండే సాస్​ తయారుచేశాడు అనేది ఒక వెర్షన్. గుడ్డు సొన, క్రీమ్​ కలిపి సాస్ తయారుచేయాలనుకున్నాడు అనేది మరో వెర్షన్. ఈ రెండూ డ్యూక్​కి నచ్చాయి. దాంతో మహోన్​ పోర్ట్​ను గెలిచినందుకు గుర్తుగా ‘మహోన్నైజ్’ అని పిలిచాడు. అదే ప్రస్తుతం మయోనీస్​గా పిలుస్తున్నాం.

బయోన్నైజ్​ వర్సెస్ మయోన్నైజ్​

ఫుడ్​కి సంబంధించిన చరిత్రకారులు ఫ్రెంచ్​ టౌన్ అయిన ‘బయోన్నే’ స్పెషల్​ సాస్​ని బయోన్నైజ్ అని పిలిచేవారు. అదే వాడుకలో మయోనీస్​గా మారిందని చెప్పారు. అయితే బయోన్నే అనేది యూరప్​లోని మేలైన హామ్స్​ (పంది మాంసం) నుంచి తయారుచేసింది. అంతేకానీ మహోన్ పోర్ట్ విజయానికి సంబంధం లేదని ఫుడ్ క్రిటిక్స్ అభిప్రాయం. ఫుడ్ ఆథర్స్ మాత్రం మయోన్నైజ్ అనేది మినోర్కాలో ఆల్రెడీ ఉందని, అది స్పెయిన్​కి చెందిన రెసిపీ అని, అది ఫ్రెంచ్​ వాళ్లు ఎక్స్​పోర్ట్ చేసుకున్నట్టు రాశారు.

అలాగే, ఫ్రెంచ్​ వంటకాల్లో కూడా18వ శతాబ్దం వరకు మయోన్నైజ్ ప్రస్తావన లేదు. కాబట్టి లాజికల్​గా ఆలోచిస్తే.. ఇది స్పెయిన్​ నుంచి ఫ్రెంచ్​ వాళ్లు తీసుకున్నదే అంటారు. ఇకపోతే.. ఫ్రెంచ్ అడ్వకేట్స్​ మయోనీస్​ అనేది ‘మనేర్ (manier) అంటే చేయడం, లేదా మయో (moyeu) అంటే  పాత ఫ్రెంచ్​ పదం గుడ్డు సొన. ఇలా మయోన్నైజ్ అనే పేరు వచ్చి ఉండొచ్చు అంటున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు.. ఫ్రెంచ్​ వాళ్ల పురాతన రెసిపీల్లో ఇది ఉందని మరికొందరు అంటున్నారు. ఇలా మయోనీస్​పై రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. కానీ మయోనీస్​ పుట్టుక గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు.

మనదేశానికి ఇలా పరిచయం

బ్రిటిష్​ రాజులు ఇండియాను పాలించిన టైంలో వాళ్లు తినే మాంసం, సలాడ్స్​ వంటి వాటిని మయోనీస్​తో కలిపి తినేవాళ్లు. ఇక్కడి వేడి వాతావరణానికి చల్లగా ఉండే ఫుడ్​ తీసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని వాడేవాళ్లు. మయోనీస్​ని వేడి చేయరు కాబట్టి వాళ్లు దాన్ని ఇష్టపడేవాళ్లు. పైగా సాస్​లు కలిపి తినాలంటే చాలావరకు క్రీమ్​ వాడాల్సి వస్తుంది. కానీ, క్రీమ్​ అనేది అన్ని వేళలా నాణ్యతతో కూడినది దొరక్కపోవచ్చు. కాబట్టి మయోనీస్​ తినేవాళ్లు. అలా మన ఇండియన్లకు కూడా అలవాటు అయిందట!

ఎంతకాలం నిల్వ ఉంటుందంటే..

మయోనీస్​లో గుడ్డుసొన, నూనె మెయిన్ ఇంగ్రెడియెంట్స్. ఫ్లేవర్​ కోసం నిమ్మరసం లేదా వెనిగర్ కలుపుతారు. ఆ మిశ్రమం క్రీమ్​లా తయారయ్యాక తినడానికి వాడతారు. 4  నుంచి 6 డిగ్రీల దగ్గర స్టోర్ చేయాలి. అయితే పచ్చిగుడ్లను వాడడం వల్ల అది ఎక్కువకాలం నిల్వ ఉండదు. ఫ్రిజ్​లో పెట్టినా కూడా కాసేపటికి పాడవుతుంది. సాధారణంగా మయోనీస్​ ఉన్న జార్​ మూత తీయకుండా ఉంటే మూడు నెలలు తాజాగా ఉంటుంది.

మూత తీశాక, ఫ్రిజ్​లో పెడితే రెండు నెలలలోపు వాడాలి. అదే ఇంట్లో తయారుచేసినది అయితే ఫ్రిజ్​లో పెట్టినా కూడా ఒక్క వారంలోపే వాడాల్సి ఉంటుంది. లేదంటే పాడవుతుంది. ఇకపోతే.. ఇప్పుడు మార్కెట్లో దొరికే మయోనీస్​ల్లో రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి. షెల్ఫ్​ లైఫ్​ కూడా ఎక్కువ కాలం ఉండేలా ఎగ్​ లెస్ అంటే గుడ్ల సొన వాడకుండా కూడా తయారుచేస్తున్నారు. 

మయోనీస్​ ప్రస్తుతం మన రాష్ట్రంలో బ్యాన్​ అయ్యింది. గత సంవత్సరం కేరళలో దీన్ని బ్యాన్​ చేశారు. ఈ నేపథ్యంలో అసలు మయోనీస్​ ఎప్పుడు? ఎక్కడ పుట్టింది? వంటి ఇంట్రెస్టింగ్​ విషయాలతో పాటు.. హెల్త్​ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం.

సైడ్​ డిష్​గా..

మయోనీస్​ని పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్​ ఫ్రై​స్​ వంటి వాటిల్లో ఎక్కువగా తినేవాళ్లు. అయితే, ఈ మధ్య మండి బిర్యానీ అనేది ఫ్యాషన్​గా మారింది. అందులో కూడా మయోనీస్​ సైడ్​ డిష్​గా సర్వ్ చేస్తున్నాయి రెస్టారెంట్లు. అలాగే ఫ్రాంకీలను కూడా మయోనీస్​లో కలిపి తింటున్నారు. బ్రెడ్, వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి శాండ్​విచ్ అనేది  బెస్ట్ ఫుడ్ అనుకుంటారు. కానీ, దానిపై మయోనీస్​ పూసుకుని తింటున్నారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మయోనీస్​లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ.

బాగా వేగించిన ఫుడ్, దానికి కాంబినేషన్​గా మయోనీస్​ తినడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి. పైగా ఆ టేస్ట్​ అలవాటయితే రెగ్యులర్​గా తినాలపిస్తుంటుంది. ప్రస్తుతం జంక్ ఫుడ్​ తినేది యంగ్​ జనరేషన్​. కాబట్టి సమస్యలు కూడా వాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యంగ్ జనరేషన్​లో కొలెస్ట్రాల్ పెరగడం, స్ట్రోక్స్ రావడానికి కారణం ఫ్యాట్స్. అలాగే ఎక్కువకాలం తీసుకోవడం వల్ల ఒబెసిటీ బారిన పడుతున్నారు.

అంతేకాకుండా.. మయోనీస్​ తయారీలో గార్లిక్, మస్టర్డ్​ వంటి ఫ్లేవర్స్ వాడతారు. ఇండియన్​ ప్రిపరేషన్​లో ఎక్కువగా ఉప్పును వాడతారు. అందువల్ల పాడైన మయోనీస్​ తింటే టేస్ట్​లో ఎలాంటి తేడా అనిపించకపోవచ్చు. కానీ, పాడైన మయోనీస్​ తినడం వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ప్రాబ్లమ్స్, వాంతులు, డయేరియా వంటివి రావొచ్చు. అంతేకాదు.. మయోనీస్​ను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తినడం, ఎక్కువ కాలంపాటు రెగ్యులర్​గా తీసుకోవడం ఈ రెండూ ఆరోగ్యానికి ముప్పే. 

మయోనీస్​ తినాలంటే..

స్ట్రీట్​ ఫుడ్స్ దగ్గర అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల వాళ్లే తయారుచేస్తుంటారు. అలాంటప్పుడు తయారుచేసే క్రమంలో కల్తీ కావొచ్చు. అలాంటిచోట తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందుగా అది ఎలా ప్రిపేర్​ చేశారు? ఎక్కడ స్టోర్ చేశారు? అనేది తెలుసుకోవాలి. డబ్బాల్లో ఉన్నదయితే.. దానిపై ఎక్స్​పైరీ డేట్ చెక్ చేయాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే తిన్న తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మయోనీస్​ తినాలంటే.. క్వాలిటీ బాగుండాలి. క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలి. 

ప్రాణాంతకమా?

ఒక్కసారి వెళ్లి తినడం వల్ల ఏమీ కాకపోవచ్చు. కానీ, ఏదైనా అయ్యిందంటే మాత్రం దానికి గల కారణాలు తెలుసుకోవాలి. బయట ఫుడ్​ తిన్నాక ఒంట్లో బాగోలేకపోతే తిన్న ఫుడ్​ పడిందా? లేదా? అనే డౌట్ రావాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్​ దగ్గరకి వెళ్లాలి. ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారా? అంటే.. చెప్పలేం. ఎందుకంటే వాళ్లకు ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉండి ఉండొచ్చు. దాన్ని రెట్టింపు చేసే విధంగా ఫుడ్ ఉన్నా.. కల్తీ అయినది, లేదా ఎక్కువ కాలం నిల్వ చేసినది తినడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చు.సాధారణంగా లోకల్​గా తయారుచేసేవాటిలో కల్తీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బయట తినేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి.

డాక్టర్ సుజాత స్టీఫెన్, చీఫ్​ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.