హనుమత్​ జయంతి 2024స్పెషల్: ​హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష

నమ్మినవారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు అభయాంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్త ఆంజనేయుడు. సిందూర ప్రియుడు. ఒక్కసారి మాలధరించి 'అంజన్నా.. అని పిలిస్తే' పలుకుతాడనే నమ్మకం. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఒకసారైనా హనుమాన్ మాల ధరించాలనుకుంటారు. ఏప్రిల్​ 23న హనుమాన్ జయంతి సందర్భంగా... ఆంజనేయుడి మాలా విశిష్టత గురించి తెలుసుకుందాం. . 

 చైత్ర, వైశాఖ మాసాల్లో ప్రముఖ ఆంజనేయుడి స్వామి ఆలయాల్లో హనుమాన్ నామస్మరణ మార్మోగుతుంది. కఠిన నియమాలు ఆచరిస్తూ ఆంజనేయుడి సేవలో తరిస్తున్నారు భక్తజనం.. మాలధారణ చక్కని నడవడిక, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అందిస్తుంది. అందుకే హనుమాన్ మాలకు అంత ప్రాధాన్యం ఉంది.

కఠిన నియమాలు

మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వేకువజామున బ్రహ్మ ముహూర్త శిరస్నానం చేయాలి. దీక్షను స్వీకరించే భక్తులు తెల్లని లుంగీ, కాషాయం చొక్కా ధరించాలి. మధ్యాహ్నం భిక్ష మూడు గంటలకు ముగించాలి. ఒంటిపై చొక్కా విడిచి కండువా, పంచెను నడుముకు కట్టుకుని పూజలు చేయాలి. గంధం, కుంకుమ, సింధూరం, బొట్టు పెట్టుకోవాలి. అబద్దాలు, అధిక ప్రసంగాలు చేయకూడదు. మూత్ర విసర్జన తర్వాత కాళ్లు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే మాలధారణకు ఒక అర్థం ఉంటుంది.

also read : ఏప్రిల్​ 23 హనుమాన్​ జయంతి...ఆ రోజు ఏం చేయాలంటే..

పూజా విధానం

  • "ఓం శ్రీరామ, జయ జయ రామ' అంటూ 108 సార్లు జపించాలి. 
  • ఓం శ్రీ రామదూతాయ నమః దీక్ష మంత్రం 108 సార్లు, సర్వదేవత నామ సంకీర్తన చేయాలి. 
  • మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని స్మరించాలి. 
  • అనంతరం గురు బ్రహ్మ, గురు విష్ణు, శుక్లాంబరధరం శ్లోకంతోపాటు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పరించాలి. 
  • స్వామివారి ప్రతిమ ఉన్న మాలలను మాత్రమే ధరించాలి.

చన్నీటి స్నానం : హనుమాన్ మాలధారులు దీక్షా కాలమంతా తెల్లవారుఝాము నుంచి మొదలవుతుంది. చల్లని నీళ్లతో స్నానం చేసి పూజకు ఉపక్రమించాలి. చన్నీటి స్నానంతో మనసుకు హాయి కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది.

మితాహారం: దీక్షాపరులు ప్రతిరోజు మితాహారం మాత్రమే తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం తీసుకుంటారు. మితాహారం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండటంతో పాటు వ్యాధులు దూరమవుతాయి. సాత్విక ఆహారం తీసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లి, మసాలా దినుసులు వాడకూడదు.

పాదరక్షలు లేకుండా.. దీక్షా కాలం మొత్తం పాదరక్షలు ధరించరు. కొండగట్టు, మద్దిమడుగు ఇతర యాత్రలకు వెళ్లేటప్పుడు పాదరక్షలు లేకుండానే నడవాలి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల రక్త ప్రసరణ హృదయ స్పందనలు మెరుగ్గా ఉంటాయి. 

నిత్యం నేలపై నిద్రించాలి:  భూతల శయనం సుఖం, మనశ్శాంతి ఇస్తుంది. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపై పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా మేలు చేస్తుంది.

చల్లని చందనం : రెండు కనుబొమల మధ్య మొదటి భాగం విశిష్టమైనది. కుంకుమ, విబూధి, గంధం, చందనంలో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. నాడీ మండలానికి కేంద్రమైన నుదుటి బొట్టు సున్నితమైంది. ఆరోగ్యదాయకమైంది.

కాషాయ దుస్తులు: మాలధారులు కాషాయ దుస్తులు ధరించాలని నియమం ఉంది. ఎండాకాలంలో దీక్షలు వేయాల్సి ఉంటుంది. ఎండ వేడి కాబట్టి వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో కాషాయపు రంగు ఉపయోగకరంగా ఉంటుంది.

మనసుకు ప్రశాంతత: హనుమాన్ దీక్ష మాల ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. నియమాలు పాటించడంతో పాటు మంచి అలవాట్లు అలవరచుకోవాలి. భక్తి భావాలు పెరుగుతాయి. అవకాశం ఉంటే ప్రతియేటా మాల ధరిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

ఏకాగ్రత పెరుగుతుంది: ప్రతి ఏటా హనుమాన్ మాల  మాల ధరించడం వల్ల కోరుకున్న పనులు జరుగుతాయని నమ్మకం. ఏకాగ్రత పెరుగుతుంది. కఠిన నియమాలతో మంచి అలవాట్లు అలవడుతాయి. క్రమశిక్షణ అలవాటవుతుంది. మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

ఆరోగ్యానికి రక్ష: హనుమాన్ మాలతో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆహారంతో పాటు నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటాం. మాల వల్ల ఆరోగ్య రక్షణ ఉంటుంది. 41 రోజుల పాటు ఐకమత్యంగా ఉండడం, అన్ని పనులు చేసుకోవడం అలవడుతుంది.

వాసర దేవుడైన హనుమంతుడు చైత్రపూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజున వాయుపుత్రుడైన హనుమంతుడిని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదని పండితులు అంటున్నారు. శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.