ఫిబ్రవరి 2022 నాటికి నెలకు 5 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంటున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. రాబోయే రెండు నెలల్లోనే గతంలోని నెలకు 3 లక్షల క్రెడిట్ కార్డుల జారీని అందుకోగలుగుతామనే ధీమాను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావు వ్యక్తం చేశారు. గత 9 నెలల్లో 5 లక్షల మంది డిపాజిట్ కస్టమర్లు చేరారు కాబట్టి టార్గెట్ అందుకోవడం కష్టం కాదని పేర్కొన్నారు. 6 కోట్ల మంది కస్టమర్ల బేస్‌కు కిందటి 9 నెలల్లో ప్రతి నెలా 4 లక్షల మంది కొత్త కస్టమర్లు యాడ్ అయినట్లు చెప్పారు. కస్టమర్లలో కొంత మందిని ప్రీ అప్రూవ్డ్ కార్డుల కోసం ఇప్పటికే గుర్తించామని, మొత్తం కార్డులలో 80 శాతం కొత్త కస్టమర్లకే జారీ చేస్తున్నామని అన్నారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో తరచూ ప్రాబ్లమ్స్ రావడంతో కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలను కిందటి వారంలో ఎత్తి వేసింది. దీంతో క్రెడిట్ కార్డుల మార్కెట్లో తన వాటాను మళ్లీ పెంచుకునే ప్రయత్నాలను బ్యాంకు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికీ 1.48 కోట్ల క్రెడిట్ కార్డులతో హెచ్డీఎఫ్సీ బ్యాంకే మార్కెట్ లీడర్. అంతకు ముందున్న 1.54 కోట్ల నుంచి చూస్తే ఆరు లక్షల కార్డులు తగ్గిపోయాయి. క్రెడిట్ కార్డుల మార్కెట్లో ఎస్బీఐ రెండో ప్లేస్‌లోను, ఐసీఐసీఐ బ్యాంకు మూడో ప్లేస్‌లోనూ నిలుస్తున్నాయి. కొత్త పార్ట్నర్షిప్లతో బిజినెస్‌ను పెంచుకుంటామని పరాగ్ రావు వెల్లడించారు.
