నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్   

ప్రజా సంక్షేమమే  ధ్యేయం 

  • ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, వెలుగు : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పట్టణంలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పోచంపల్లి పట్టణం 12వ వార్డు భావణాఋషిపేటలో అంగన్ వాడీ బిల్డింగ్ ను ప్రారంభించారు. అనంతరం పలు వార్డుల్లో పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మహిళాశక్తి కింద మంజూరైన ట్రాక్టర్​ను అందజేశారు. లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​చెక్కులు పంపిణీ చేశారు.  

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి 

హాలియా, వెలుగు : సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసులకు సూచించారు. శుక్రవారం హాలియా పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, స్టేషన్ పరిసరాలు, స్థితిగతులు, ఉమెన్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.   

ఫర్టిలైజర్ షాపులో చోరీ

హాలియా, వెలుగు : ఫర్టిలైజర్​షాపులో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన పెద్దవూర మండలంలో జరిగింది. ఎస్ఐ వీరబాబు వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఆంజనేయ అగ్రిమార్ట్ ఫర్టిలైజర్స్, సీడ్స్ షాపులో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వెనకవైపు గల రేకులను కట్ చేసి చొరబడ్డారు. కౌంటర్ ను పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం షాపు పక్కనే ఉన్న హార్డ్వేర్ షాప్,  బైక్ మెకానిక్ షాప్ లో దొంగతనానికి ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం ఆంజనేయ అగ్రిమార్ట్ షాప్ యజమాని గిరిధర్ వచ్చి చూడగా, రేకులు కట్​చేసి ఉన్నాయి. కౌంటర్​లో డబ్బు కనిపించలేదు. దీంతో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

సత్తాచాటిన గ్రీన్ గ్రోవ్ స్కూల్ విద్యార్థులు

చిట్యాల, వెలుగు : చిట్యాల మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు 9వ సబ్ జూనియర్ యూత్ నేషనల్ సాఫ్ట్ బేస్​బాల్ కాంపిటీషన్ లో సత్తాచాటారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బేస్ బాల్ క్రీడల్లో విద్యార్థులు కట్ట అఖిల్ నందన్, వెలిమినేటి రామ్ చరణ్, జనగం ప్రణీత్,  షేక్ సోను సోహెల్, షేక్ అయేషా, కొడదల హనుమదీశ్వరి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శుక్రవారం పీఎస్​లో చిట్యాల సీఐ నాగరాజు, ఎస్ఐ ధర్మ అభినందించి సన్మానించారు. 

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి 

హాలియా, వెలుగు : విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందిన ఘటన త్రిపురారం మండలం సత్యపాడు తండాలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విప్లవత్తు కృష్ణ –సావిత్రి దంపతుల కుమారుడు ఇస్లావత్ శరత్(8) ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు శరత్ ను ఇంటి వద్ద ఉంచి పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూలేకపోవడంతో తల్లిదండ్రుల వద్దకు బయల్దేరాడు. పొలం గట్టుపై నడుచుకుంటూ బాలుడు వెళ్తుండగా, స్తంభం నుంచి బోరు మోటర్ కు వెళ్లే విద్యుత్ వైరు తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

బస్సు, బైక్ ఢీకొని ఒకరు మృతి 

దేవరకొండ, వెలుగు : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన దేవరకొండలో శుక్రవారం జరిగింది. సీఐ నరసింహులు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన జక్కుల మల్లేశ్ యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై దేవరకొండ బస్టాండ్ వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్​ను ఢీకొట్టడంతో మల్లేశ్ యాదవ్(38) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.