మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

తహసీల్దార్​ ఆఫీసు ముందు ఆందోళన

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్​ఆఫీసు ముందు వెలిమెల లంబాడి తండా, కొండకల్​తండా వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. 80 ఏళ్లుగా కాస్తు చేసుకుంటున్న భూములను కొంతమంది పెత్తందారులకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల బార్డర్​లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్నో దశాబ్ధాలుగా తామే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. 

1994 నుంచి తమకు పట్టాలివ్వాలని అప్పటి ప్రభుత్వం నుంచి ఇప్పటి దాకా అర్జీలు పెట్టుకున్నామని తెలిపారు. ఈ విషయంపై తామంతా హైకోర్టును ఆశ్రయించామని నేటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న తమని కాదని కొంతమంది బడాబాబులకు ఆ భూములను కట్టబెట్టడం సరికాదన్నారు. 

ఫొటోగ్రాఫర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

మెదక్​టౌన్​, వెలుగు:  మెదక్ జిల్లా ఫొటోగ్రాఫర్ల యూనియన్ ఎన్నికల్లో కంచి ఆనంద్ టీమ్​15 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ప్రెసిడెంట్​గా కంచి ఆనంద్, జనరల్​సెక్రెటరీగా బండ చంద్రశేఖర్, కోశాధికారిగా శ్రీధర్ గెలుపొందారు. వీరికి ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర యూనియన్ కమిటీ ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి మాధవరెడ్డి, కుటుంబ భరోసా ఇన్​చార్జి నాగరాజు, రాష్ట్ర సలహాదారు కేదార్​నాథ్​నియామక పత్రాలను అందజేశారు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. 

రైస్​మిల్​లో చోరీ 

కొల్చారం, వెలుగు:కొల్చారం మండలం రాంపూర్ రైస్​మిల్​లో ఆదివారం రాత్రి చోరి జరిగింది. మెదక్,- హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అన్నపూర్ణ రైస్ మిల్ తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఎస్ఐ మహ్మద్ గౌస్ తెలిపారు. మిల్లు యజమాని ఉప్పల మల్లేశం ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

గోవా మద్యం పట్టివేత

జహీరాబాద్, వెలుగు: అక్రమంగా కారులోతరలిస్తున్న 64  గోవా మద్యం బాటిళ్లను డీటీఎఫ్​టీం, ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని సీజ్​చేశారు. సోమవారం జహీరాబాద్ సమీపంలోని ఎక్సైజ్​చెక్​పోస్ట్​వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.వీటి విలువ రూ. 1.60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మద్యం తరలిస్తున్న కారుతో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న వారిలో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల ప్రాంతాలకు చెందిన కృష్ణ, రామ్, మారుతి, అజయ్ ఉన్నారని ఎక్సైజ్​పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

డైట్​సెట్ ​వెబ్​ఆప్షన్​ నోటిఫికేషన్​ రిలీజ్​

మెదక్​ టౌన్​, వెలుగు: డైట్ సెట్​2024కు సంబంధించి మూడో విడత వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైట్​ ప్రిన్సిపాల్​ రమేశ్​బాబు సోమవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 2 నుంచి 4వరకు మీ-సేవా కేంద్రాల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. జనవరి 9న సీట్లు కేటాయిస్తామని తెలిపారు.