మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

పార్ట్​టైమ్ టీచర్ల ఇంటర్వూలు

జోగిపేట, వెలుగు: ఆందోల్​ గురుకుల స్కూల్​లో పార్ట్​టైమ్​అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్​ లింగారెడ్డి శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి 41 అభ్యర్థులు హాజరై, సీనియర్​ టీచర్ల ముందు డెమో ఇచ్చినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల వివరాలను అధికారులకు పంపుతానని, వారు ఎంత మందిని అలాట్​ చేస్తారనే విషయం తెలియదని చెప్పారు.  కాగా ఇటీవల స్కూల్​లో స్టూడెంట్స్​ చేసిన ఆందోళనపై స్పందించిన అధికారులు 13 మంది రెగ్యులర్​ టీచర్లను హెడ్​ఆఫీస్​కు పిలిచి విచారిస్తున్నట్లు ప్రిన్సిపల్​వెల్లడించారు. 

రజక మహాసభలను సక్సెస్​చేయాలి 

బెజ్జంకి, వెలుగు: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29న జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో జరిగే  మూడో మహాసభలను సక్సెస్​చేయాలని మండల రజక సంఘం అధ్యక్షులు దీటి రాజు శుక్రవారం పిలుపునిచ్చారు. సభకు రజకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు వస్తారని పేర్కొన్నారు..

పీడీఎస్ యూ జిల్లా కమిటీ ఎన్నిక

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలో జరిగిన పీడీఎస్​యూ జనరల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్​ శుక్రవారం తెలిపారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా దేవులపల్లి రమేశ్, ప్రధాన కార్యదర్శిగా గ్యార గణేశ్, ఉపాధ్యక్షుడిగా హరిప్రసాద్, సహాయ కార్యదర్శిగా కిరణ్, కోశాధికారిగా కుమార్, మరో నలుగురిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. 

30 శాతంఫిట్మెంట్ ప్రకటించాలి

సంగారెడ్డి టౌన్ , వెలుగు:ఈ నెల 30న క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు 30 శాతం ఫిట్మెంట్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని తెలంగాణ మజ్దూర్ జాతీయ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి శుక్రవారం కోరారు. గతంలో ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా 2021, ఏప్రిల్ 1 నుంచి కార్మికులకు అమలు కావాల్సిన వేతన సవరణపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు

అమిత్ షా క్షమాపణలు చెప్పాలి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్​షా పార్లమెంట్​లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అమిత్​షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మనుస్మృతిని అమలు చేయడంలో భాగంగానే అంబేద్కర్, రాజ్యాంగంపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసన ర్యాలీలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, సహాయ కార్యదర్శి యాదగిరి, ప్రజాసంఘాల నాయకులు అశోక్,శివ, రాజు, నర్సింలు, రాజేశ్, లక్ష్మీనారాయణ, మల్లేశం, నాగభూషణం, షబ్బీర్ అలీ, దుర్గయ్య, మోహన్ ఉన్నారు.