మహబూబ్ నగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

పర్మిషన్​ ఇవ్వండి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్  కాలేజీ భవనాల నిర్మాణానికి పర్మిషన్​ ఇవ్వాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, రిజిస్ట్రార్​ చెన్నప్ప కోరారు. శుక్రవారం ప్రిన్సిపల్  సెక్రటరీ, ఇతర అధికారులను పీయూకు లా, ఇంజనీరింగ్  కాలేజీలకు సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని, కొత్త భవనాల నిర్మాణం కోసం వెంటనే పర్మిషన్​ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే విద్యాసంవత్సరం కోర్సులు ప్రారంభం కానుండగా, తరగతులు సాఫీగా నిర్వహించుకోవడానికి సహకరించాలని కోరారు.

హైకోర్టు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం

వనపర్తి టౌన్, వెలుగు: తెలంగాణ హైకోర్టు విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి  సహదేవుడు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు 1,637 పోస్టులకు నోటిఫికేషన్​ ఇస్తే అందులో 1,200 ఉద్యోగాలను ఓసీ, ఈడబ్ల్యూఎస్  కోటా కింద కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ డబ్ల్యుఎస్  రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. నోటిఫికేషన్  రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు పెంచి రీ నోటిఫికేషన్  ఇవ్వాలని డిమాండ్  చేశారు. రవి, నాగరాజు, విజయ్ కుమార్, వెంకటేశ్, కురుమూర్తి, గోవిందు, నరసింహ పాల్గొన్నారు.

అనంతపురంలో రైలు ఢీకొని కూలీ మృతి

పెద్దమందడి, వెలుగు: ఉపాధి కోసం వలస వెళ్లిన జిల్లాకు చెందిన ఓ కూలీ ఏపీలోని అనంతపురం రైల్వే స్టేషన్ లో శుక్రవారం రైలు ఢీకొని చనిపోయాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(52) పని కోసం అనంతపురం జిల్లాకు వెళ్లారు. రెండు రోజుల కింద గ్రామానికి వచ్చి, తిరిగి అనంతపురం రైలులో వెళ్లారు. స్టేషన్​లో రైలు దిగుతుండగా, ప్రమాదానికి గురైనట్లు బంధువులు తెలిపారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్  ఒక్కటే

వనపర్తి/గద్వాల టౌన్, వెలుగు: ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీలు ఒకటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్  విమర్శించారు. శుక్రవారం వనపర్తి, గద్వాలలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కమిటీలు, కేసుల విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ఆరు గ్యారంటీలను పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజేందర్​రెడ్డి, డి నారాయణ, సబిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్  లోకనాథ్, పురుషోత్తం రెడ్డి,  శ్రీశైలం,  రామన్ గౌడ్, ప్రభాకర్, రామచంద్రారెడ్డి, డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, శివారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహులు, జయశ్రీ పాల్గొన్నారు.

క్రికెట్​ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

అయిజ, వెలుగు: సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని తిక్క వీరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పీఏసీఎస్​ మాజీ చైర్మన్  సంకాపూర్ రాముడు, కౌన్సిలర్  సీఎం సురేశ్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయిజ ప్రీమియర్  లీగ్  క్రికెట్ పోటీలను శుక్రవారం అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. అంతకుముందు తిక్క వీరేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్  చైర్మన్  దేవన్న, వైస్  చైర్మన్  నర్సింలు, రంగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.

ఎంపీకి వినతి

ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లి మండలం వెల్జాల్ ను మండలకేంద్రంగా ప్రకటించి, ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవికి గ్రామస్తులు, నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గ్రామంలో ఆసుపత్రి, మండల కేంద్రం ఏర్పాటుతో 10 గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్  డైరెక్టర్  వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి, నాయకులు అజీమ్, నర్సింలు, ఆరిఫ్  పాల్గొన్నారు.

విద్యా నిధికి విరాళం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పేద విద్యార్థులకు సాయం అందించేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన విద్యా నిధికి లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం కలెక్టర్  విజయేందిర బోయిని కలిసి చెక్కును అందించారు. ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందించాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్  యాదవ్  పాల్గొన్నారు.