మహబూబ్ నగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

మార్చి వరకు సాగు నీరు ఇవ్వాలి

గద్వాల, వెలుగు: ఆర్డీఎస్  కింద యాసంగి సాగుకు మార్చి వరకు సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్  చేశారు. అయిజ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి వరకు నీళ్లు ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారని, ఇలాగైతే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందన్నారు. ముందుగా చెప్పినట్లు మార్చి నెల వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్  చేశారు. 

నేడు ఎస్సీ వర్గీకరణపై విచారణ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్  అక్తర్  జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్  విజయేందిర బోయి తెలిపారు. కలెక్టరేట్​లో ఉదయం 11 గంటల నుంచి ఈ అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని ఎస్సీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, సమస్యలపై చర్చిస్తారని చెప్పారు. 

ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో సోమవారం ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షుడు బత్తిని రాము మాట్లాడుతూ విద్యార్థి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 

పీయూ సమస్యలపై ధర్నా

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని, మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్  చేస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు పీయూ అడ్మినిస్ట్రేషన్​ ఆఫీస్​ను ముట్టడించారు. యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్  కోర్సులను వెంటనే రెగ్యులరైజ్  చేయాలని డిమాండ్ చేశారు. లా, ఇంజనీరింగ్  కాలేజీ హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని కోరారు. వీసీ శ్రీనివాస్  సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

 కార్యకర్తకు ఆర్థికసాయం

హన్వాడ, వెలుగు: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కాంగ్రెస్  నాయకుడు సురేందర్ రెడ్డి రూ. లక్ష ఆర్థికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు. మండలానికి చెందిన మేస్త్రీ రాజు కొడుకు నరేశ్​ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని వైద్య ఖర్చులకు సాయం చేశారు. వెంకటయ్య, కృష్ణయ్య, గంగపురి,పెంటయ్య పాల్గొన్నారు.

రూల్స్  బ్రేక్  చేస్తే కేసులు

గద్వాల, వెలుగు: రూల్స్  బ్రేక్  చేస్తే కేసులు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. డిసెంబర్ 31 రోజు సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా అంతటా డ్రంక్  అండ్  డ్రైవ్  టెస్ట్ లు నిర్వహిస్తామని తెలిపారు. క్రాకర్స్  కాల్చవద్దని, ఆర్కెస్ట్రా, డీజేలు పెట్టవద్దన్నారు. ట్రిపుల్  రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్  తాగడం వంటివి చేయవద్దని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్  పార్టీలతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

1.68 లక్షల సభ్యత్వాలు

పెబ్బేరు, వెలుగు: రాష్ట్రంలో టీడీపీకి 1.68 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలిపారు. సోమవారం పెబ్బేరులో మీడియాతో మాట్లాడారు. పెబ్బేరు మండలంలో ఇప్పటి వరకు 487 సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో సభ్యత్వాలు తీసుకుంటున్నారని తెలిపారు. సితార వెంకటేశ్వర్లు, రామన్​గౌడ్, వాకిటి బాలరాజ్, సుధాకర్, తిరుమలేశ్, శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

మదనాపురం, వెలుగు: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొన్నూరు గ్రామానికి చెందిన పవన్(22) సోమవారం రాత్రి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్  27న మదనాపురం గురుకుల పాఠశాలలో ప్రవీణ్  అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కుటుంబసభ్యులు, విద్యార్థి, ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్​ మదనాపురం తహసీల్దార్​తో ఫోన్​లో మాట్లాడి మృతుడి కుటుంబానికి అవుట్​ సోర్సింగ్​ఉద్యోగం ఇస్తామని హామీ ఇప్పించారు. 

అయితే ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వకపోవడంతో సోమవారం ప్రవీణ్  తల్లిదండ్రులు, అన్న పవన్   వనపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి వెళ్లారు. దరఖాస్తు అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో ఇంటికి వచ్చారు.

 అధికారులు ఉద్యోగం ఇస్తామని చెప్పి నెల దాటినా ఇవ్వకుండా సమయం పడుతుందని చెప్పడంతో మనస్తాపానికి గురైన పవన్​  సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి, వెంటనే అతడిని కిందికి దించి కొత్తకోటలోని ప్రైవేట్  హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.