మహబూబ్‌నగర్ జిల్లాలో ఫటా ఫట్ వార్తలు ఇవే 

 మైసిగండి ఆలయానికి రూ.11.40 లక్షల ఆదాయం

ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో ఆలయానికి రూ.11,40,200 ఆదాయం వచ్చినట్లు ఈవో స్నేహలత తెలిపారు. కొబ్బరి చిప్పలు, ఒడి బియ్యం, చీరల సేకరణకు నిర్వహించిన వేలంపాటలో మైసిగండికి చెందిన కేతావత్  పరంసింగ్  దక్కించుకున్నట్లు చెప్పారు. ఆలయ ఫౌండర్  ట్రస్టీ శిరోలి, దేవాదాయ శాఖ ఇన్స్​పెక్టర్  ప్రణీత్ కుమార్, ప్రధాన అర్చకులు యాదగిరి పాల్గొన్నారు.

108లో డెలివరీ

అమ్రాబాద్, వెలుగు: పదర మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన శివలీల(20)కు గురువారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రాగా, 108 కు సమాచారం అందించారు. ఈఎంటీ శ్రీనివాసులు, పైలట్  బషీర్  గ్రామానికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా, నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే పురుడు పోశారు. ఆడ శిశువు జన్మించగా, తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని అమ్రాబాద్  సివిల్  ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

ఇల్లు దగ్ధం

రేవల్లి, వెలుగు: షార్ట్  సర్క్యూట్ తో మండలంలోని కొంకలపల్లి గ్రామానికి చెందిన కొంకాల నిరంజన్  ఇల్లు దగ్ధమైంది. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లగా, ఇంట్లో నుంచి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఇంటికి వచ్చేసరికి పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని సామానుతో పాటు విలువైన వస్తువులు కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడికి పరిహారం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.

రగ్బీ జట్టుకు ఎంపిక

కోస్గి, వెలుగు: మండలంలోని సర్జఖాన్ పేట్  జడ్పీ హైస్కూల్​కు చెందిన తడకల సంధ్యారాణి అంతర్రాష్ట్ర రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కృష్ణగౌడ్  తెలిపారు. ఈ నెల 29 నుంచి 31 వరకు బిహార్  రాష్ట్రంలోని పాట్నాలో జరిగే 68వ ఎస్జీఎఫ్  రగ్బీ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొనే అవకాశం దక్కింది. పీఈటీ నరసింహులు, కృష్ణమూర్తి, వినోద్, ఆశప్ప, సాయప్ప, నవీన్, ప్రభాకర్, గంగావతి తదితరులు ఆమెను 
అభినందించారు.

ధన్వాడ: జాతీయ స్థాయి నెట్​బాల్​ పోటీలకు మండలంలోని కొండాపూర్​ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి శ్రీనివాస్​ ఎంపికయ్యాడు. ఈ నెల 28 నుంచి 31 వరకు తమిళనాడులో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు. పోటీల్లో మంచి ప్రతిభ చూపాలని ప్రిన్సిపాల్​ రాజారాం ఆకాంక్షించారు.

లాయర్ల దీక్షకు మద్దతు

గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోనే కోర్టు కాంప్లెక్స్  నిర్మించాలని డిమాండ్  చేస్తూ చేపట్టిన లాయర్ల దీక్షకు పలువురు మద్దతు పలికారు. శుక్రవారం లాయర్లు రోడ్డుపై వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. టీఆర్టీయూ, సీపీఐ, అయిజ అఖిలపక్ష లీడర్లు మద్దతు ప్రకటించారు. గద్వాలకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్​ను కలిసి వినతిపత్రం అందించారు.

నిరంతరం ‘అమ్మ ఒడి’

పెబ్బేరు, వెలుగు: ఇకనుంచి 102 వెహికల్స్​ 24 గంటల పాటు చంటి పిల్లల తల్లులకు, గర్భిణులకు సేవలు అందిస్తాయని 102 సేవల జిల్లా అధికారి డి. రత్నమయ్య తెలిపారు. శుక్రవారం పెబ్బేరులోని 102 వెహికల్స్​ను తనిఖీ చేశారు. సేవలపై గర్భిణులు, ఆశా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణిని హాస్పిటల్ కు తీసుకెళ్లి, చెకప్ లు చేయించి ఇంటి దగ్గర డ్రాప్  చేయడం, డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్  నుంచి ఇంటికి తీసుకెళ్లడం, పిల్లలకు టీకాలు వేయించడానికి 102 సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

జములమ్మకు వెండి కిరీటం

గద్వాల టౌన్, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన 7 హిల్స్  ప్రింటర్స్  అధినేత కొంకతి రాకేశ్​ శుక్రవారం వెండి కిరీటాన్ని బహూకరించారు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేజీ వెండితో తయారు చేయించిన కిరీటాన్ని అందజేసి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం ఎండోమెంట్ ఆఫీసర్లు ఆయనను సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు.

డబ్బుల కోసం వినతి

ఉప్పునుంతల, వెలుగు: కేఎల్ఐ కెనాల్​లో భూములు కోల్పోతున్న మండలంలోని తాడూరు గ్రామానికి చెందిన 50 మంది రైతులు శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి పరిహారం డబ్బులు ఇప్పించాలని కోరారు. 60 ఎకరాల భూమి సేకరించారని, ఎకరాకు రూ.9 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని చెప్పారు. వచ్చే నెలలో రైతులందరికీ డబ్బులు అందేలా చూస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.