ఎలక్షన్ డ్యూటీపై అవగాహన పెంచుకోవాలి
వికసించిన బ్రహ్మ కమలం
ధన్వాడ, వెలుగు: ధన్వాడ మండల కేంద్రంలోని వడ్ల శాంతి కుమార్ తన ఇంటిలో బ్రహ్మ కమలం మొక్కను నాటారు. గురువారం వేకువజామున బ్రహ్మ కమలం పుష్పం వికసించింది. ఈ కమలం శివుడికి ఇష్టమైన పువ్వు అని చెబుతారు. ఈ పువ్వు రెండు గంటలపాటు వికసిస్తుంది. మళ్లీ ముడుచుకుంటుంది. విషయం తెలుసుకున్న కాలనీవాసులు బ్రహ్మ కమలంను చూసేందుకు పోటీపడ్డారు. పువ్వుకు ప్రత్యేక పూజలు చేశారు.
వ్యక్తికి పదేండ్ల జైలు
నారాయణపేట, వెలుగు: యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తికి జిల్లా జడ్జి పదేండ్ల జైలు శిక్ష, రూ.55వేల జరిమానా విధించినట్లు ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. మక్తల్ పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన రాజేశ్‌గౌడ్ అదే పట్టణానికి చెందిన యువతిని పెండ్లి చేసుకుంటానని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ సహజీవనం చేశాడు. ఆ తరువాత ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పి, తనను వేధించేవాడని అప్పటి మక్తల్ ఎస్సై రాములుకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టడంతో నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.
ఆర్టీసీ బస్సులో డీజిల్ చోరీ
లింగాల, వెలుగు: ఆర్టీసీ బస్సులో డీజిల్ ను దొంగిలించారు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి డిపోకు చెందిన నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్ లింగాలలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉంచి డ్రైవర్, కండక్టర్ పడుకోవడానికి వెళ్లారు. ఉదయం 5:30కు లింగాల నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉండగా, డీజిల్ వాసన వస్తుండడంతో అనుమానంతో చూడగా డీజిల్ ట్యాంకు ఖాళీగా కనిపించింది. 200 లీటర్ల డీజిల్ దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇల్లు దగ్ధం
ఉప్పునుంతల, వెలుగు: మండలంలోని పెనిమిల్ల గ్రామానికి చెందిన తుర్పటి కృష్ణయ్య ఇల్లు బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. కృష్ణయ్య ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు బుధవారం గ్రామానికి వచ్చారు. రాత్రి వంట చేసుకొని భోజనం అయ్యాక పడుకున్నారు. గాలికి పొయ్యిలో నిప్పు రవ్వలు పడి మంటలు వ్యాపించి ఇల్లు కాలిపోయింది. బైక్, వ్యవసాయ పనిముట్లు, రెండు మోటార్లు, వంట సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. ఆర్ఐ సుజాత ఇంటిని పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అలంపూర్, వెలుగు: పట్టణంలోని మార్కెట్ కాలనీ దళితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాజు దేవదాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిపోగు ప్రేమదాస్ డిమాండ్ చేశారు. గురువారం సంత మార్కెట్ కాలనీ దళితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించా తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ మంజులకు వినతిపత్రం అందజేశారు. వెంకటస్వామి, నరసింహ, అయ్యప్ప, మౌలాలి, గంగన్న , సత్యం, మద్దిలేటి, శేషమ్మ, ఫకీరమ్మ, రుతమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.
ఇండ్లల్లో దొంగతనం
కొల్లాపూర్ , వెలుగు: కొల్లాపూర్ పట్టణంతో పాటు పెంట్లవెళ్లిలో గురువారం ఇండ్లల్లో దొంగతనాలు జరిగాయి. కొల్లాపూర్ కు చెందిన రాజు నాయక్, పెంట్లవెల్లికి చెందిన ఏకాంబర్ రెడ్డి ఇండ్లలో దొంగలు పడి 4 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు ఎత్తికెళ్లినట్లు బాధితులు తెలిపారు. క్లూస్ టీమ్‌తో కలిసి సీఐ మహేశ్, ఎస్సై రామన్ గౌడ్ దొంగతనాలు జరిగిన ఇండ్లలో ఆధారాలు సేకరించారు.