మహబూబ్ నగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

జిల్లా అభివృద్ధికి సహకరించాలి

నారాయణపేట, వెలుగు: టీజీవోలు జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ కోరారు. మంగళవారం తెలంగాణ గెజిటెడ్​ ఆఫీసర్ల ఉద్యోగుల సంఘం కొత్త కార్యవర్గం కలెక్టర్, ఎస్పీ యోగేశ్​ గౌతమ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త కమిటీ సభ్యులను కలెక్టర్, ఎస్పీలకు అధ్యక్షుడు మొగులప్ప పరిచయం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న ఉద్యోగులు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని కలెక్టర్​ కోరారు. 

మద్దూరుకు ఫస్ట్  ప్రైజ్

మద్దూరు, వెలుగు: నారాయణపేట జిల్లా స్థాయి సీఎం కప్  పోటీల్లో ఫస్ట్  ప్రైజ్  మద్దూరును వరించింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన సీఎం కప్  వాలీబాల్  పోటీల్లో మద్దూరు క్రీడాకారులు ఫస్ట్  ప్రైజ్  గెలుచున్నారు. మండల క్రీడాకారుల అసోసియేషన్  వైస్  ప్రెసిడెంట్  వారిని అభినందించారు. విఠల్, మహేందర్, రాజు, రవి, రఘు, హన్మనాయక్, సలాం, రమేశ్, మహేశ్, వెంకటేశ్, సతీశ్​లు వాలీబాల్​ టీమ్​లో ఉన్నారు.

సీసీ సస్పెండ్

కోస్గి, వెలుగు: మండల సీసీగా పని చేస్తున్న డి.సునీందర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఆర్డీవో మొగులప్ప తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో కలెక్టర్  ఆదేశాల మేరకు విచారణ జరిపి, సస్పెండ్  చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం మద్దూర్  సీసీగా పని చేస్తున్న సునీందర్  గతంలో కోస్గి మహిళ సమైఖ్యలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

యువతి ఆత్మహత్య

మిడ్జిల్, వెలుగు: పెట్రోల్  పోసుకొని నిప్పంటించుకొని మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన శ్రీలత(17) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని ఓ కాలేజీలో ఇంటర్  ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం సాయంత్రం యువతి ఇంట్లో ఒంటిపై పెట్రోల్  పోసుకొని నిప్పు అంటించుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి అంబులెన్స్ లో మహబూబ్ నగర్  గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది. యువతి తండ్రి బాలరాజు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

ఏఎన్ఎంల అరెస్ట్

మరికల్, వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఛలో హైదరాబాద్​కు వెళ్తున్న రెండో ఏఎన్ఎంలను ముందస్తుగా మంగళవారం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏండ్ల నుంచి తమను రెగ్యులరైజ్​ చేయాలని​కోరుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గీత, శోభరాణి, వరలక్ష్మి, మంజుల అరెస్ట్​ అయిన వారిలో ఉన్నారు.

క్రీడల్లో రాణించాలి 

నారాయణపేట, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఈవో గోవిందరాజులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా స్థాయి క్రాస్​ కంట్రీ పోటీలను డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. ఈ నెల 22న కల్వకుర్తి పట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రాస్  కంట్రీ పోటీల్లో పథకాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని కోరారు. యూత్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మధుసుధన్​రెడ్డి, ఎస్​వో శ్రీనివాస్, సైన్స్​ ఆఫీసర్  భాను ప్రకాశ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్  జనరల్​ సెక్రటరీ రమణ, కోచ్  హారిక దేవి, పీడీ బీరప్ప, వెంకటేశ్, ఆంజనేయులు, మహేశ్​ పాల్గొన్నారు.

బోనాలతో నిరసన

మహబూబ్​నగర్​ టౌన్, వెలుగు : సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం వినూత్న నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్  నుంచి ఎల్లమ్మ టెంపుల్​ వరకు బోనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరం వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్​ను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.  

ఘనంగా పాల ఉట్ల కార్యక్రమం

ధన్వాడ, వెలుగు: మండలంలోని గున్ముకుల స్వయంభు కడపరాయుడు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పాల ఉట్ల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో  నిర్వహించారు. భక్తుల రామ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.