హర్యానా ఘర్షణలపై 93 కేసులు.. 176 మంది అరెస్టు

హర్యానా ఘర్షణలపై 93 కేసులు.. 176 మంది అరెస్టు
  •     వీహెచ్ పీ ర్యాలీపై  900 మంది దాడి 
  •     రాళ్లు, కట్టెలు, పెట్రోల్ బాంబులు, ఆయుధాలతో అటాక్ చేసినట్లు ఎఫ్​ఐఆర్ 

చండీగఢ్: హర్యానాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు 93 కేసులు నమోదు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. మొత్తం 176 మందిని అరెస్టు చేశామని, మరో 78 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించింది. ‘‘రాష్ట్రంలో పరిస్థితులు మెరుగవుతున్నాయి. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుంది. కేంద్ర బలగాలను మోహరించాం” అని హోంశాఖ తెలిపింది. ఘర్షణల నేపథ్యంలో నూహ్, ఫరీదాబాద్, పల్వాల్, గురుగ్రామ్ లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఈ నెల 5 వరకు బంజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే త్వరలో గ్రూప్ సీ ఎగ్జామ్ ఉండడంతో హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు వీలుగా గురువారం 3 గంటల పాటు ఇంటర్ నెట్, ఎస్ఎంఎస్ సేవలను పునరుద్ధరించారు.   

ఆ రోజు ఏం జరిగిందంటే.. 

హర్యానా అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ర్యాలీపై ఓ వర్గానికి చెందిన 800 నుంచి 900 మంది దాడి చేశారని అందులో పేర్కొన్నారు. ‘‘నూహ్ జిల్లా నల్హర్ లోని శివ మందిర్ నుంచి వీహెచ్ పీ ర్యాలీ మొదలైంది. దీనికి 2,500 మంది హాజరయ్యారు. ర్యాలీ ప్రారంభం కాగానే.. దగ్గర్లోని గుట్టలు, ఇండ్ల నుంచి వందలాది మంది ఆలయం వైపు దూసుకొచ్చారు. రాళ్లు, కట్టెలు, ఆయుధాలు, పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ అటాక్ చేశారు. వాళ్లు చంపాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునేందుకు ర్యాలీకి హాజరైనోళ్లు గుడిలో తలదాచుకున్నారు. చాలామంది కార్లలో, కార్ల వెనుక దాక్కున్నారు” అని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ‘‘ఆ గుంపును కంట్రోల్ చేసేందుకు మేం ప్రయత్నించాం. కానీ వాళ్లు వినలేదు. మాపైనా దాడికి ప్రయత్నించారు. దీంతో మేం గాల్లోకి కాల్పులు జరిపాం. ఆ తర్వాత దుండగులు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు” అని తెలిపారు.  

కొనసాగుతున్న ఉద్రిక్తత.. 

నూహ్ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. బుధవారం రాత్రి 11:30కు బైక్ పై వచ్చిన దుండగులు రెండు మసీదులపై పెట్రోల్ బాంబులు విసిరారని, వెంటనే రెండు చోట్లకు వెళ్లి మంటలు ఆర్పివేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది.