కారు ప్రమాదం : గాయపడ్డ ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం

కారు ప్రమాదం : గాయపడ్డ ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం (అక్టోబర్​ 24న) అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌రావత్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం రాత్రి హల్ద్వానీ నుంచి ఉధమ్‌సింగ్‌ నగర్‌లోని కాశీపూర్‌కు కారులో బయలుదేరారు. బాజ్‌పూర్‌ వద్దకు రాగానే రావత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. 

వెంటనే రావత్​ ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన్ను డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం రావత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదం గురించి హరీశ్‌ రావత్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. హల్ద్వానీ నుంచి కాశీపూర్‌కు వెళ్తున్న సమయంలో తన కారు ప్రమాదానికి గురైందని, బాజ్‌పూర్‌లో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.