సిద్దిపేట అభివృద్ధి కోసం తెగించి పోరాడుతా : మాజీ మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట అభివృద్ధి  కోసం, ఇక్కడి ప్రజల కోసం తెగించి పోరాడుతానని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట క్యాంపు ఆఫీసులో 104 మందికి రూ.25 లక్షల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సిద్దిపేటలో రూ. 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారని, వెయ్యి పడకల ఆస్పత్రి పనులను అర్థాంతరంగా ఆపి  ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.

 నియోజకవర్గంలో రూ.200 కోట్ల రోడ్డు పనులు రద్దు చేసి మంత్రి సీతక్క ములుగుకు తీసుకపోతున్నారని, వెటర్నరీ కాలేజీ రద్దు చేస్తే కాంగ్రెస్ నాయకులు పెదవి విప్పడం లేదన్నారు. -సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు సోయి లేకుండా పోయిందని,  సిద్దిపేట అభివృద్ధి కి కాంగ్రెస్  మోకాలడ్డుతోందని ఆరోపించారు.  

సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9800 మందిని సీఎం ఆర్ ఎఫ్ ద్వారా ఆదుకున్నామని వివరించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యం రోజు రోజుకు దిగజారుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.