సీఎం రేవంత్​కు కేసీఆర్ భయం పట్టుకుంది : హరీశ్​రావు

  • 'పాలమూరు'ను అడ్డుకుంది కాంగ్రెస్​ పార్టీయే : హరీశ్​రావు
  • పెండింగ్ ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి.. పాలమూరులో లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని వెల్లడి

మహబూబ్​నగర్​/చిన్నచింతకుంట, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందని, అందుకే ఆయన ప్రసంగాల్లో పదే పదే కేసీఆర్​ను తిడుతున్నారని సిద్దిపేట బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. బుధవారం మహబూబ్​నగర్ జిల్లాలో హరీశ్ పర్యటించారు. ఈ సందర్భంగా కురుమూర్తి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం హోదాలో కేసీఆర్​ మంజూ రు చేసిన మొట్ట మొదటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని అన్నారు. 

కానీ, ఆ ప్రాజెక్టుపై కోర్టు లో కేసులు వేసి భూసేకరణ కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్​ పార్టీ పెండింగ్​లో పెట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు , భీమా, కోయిల్​సాగర్ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని గుర్తు చేశారు. తమ హయాంలో ప్రారంభించిన పాలమూరు ప్రాజెక్టు చివరి దశలో ఉందని, ఏడాది అవుతున్నా ఇంత వరకు కాంగ్రెస్​ ప్రభుత్వం పనులు చేయడం లేదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే శ్రీశైలంలో నీళ్లు సముద్రానికి వెళ్లే పరిస్థితి వచ్చేది కాదన్నారు. 

ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి కనబడ్డ దేవుళ్ల మీద ప్రమాణం చేసి మాటతప్పారని అన్నారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చేయట్లేదన్నారు. పరిపాలన చేతకాక  ఫ్రస్ట్రేషన్​లో తిట్ల పురాణం మొదలు పెడుతున్నారన్నారు. 

ఇటీవల జరిగిన వరంగల్​ సభలో రేవంత్ రెడ్డి 50 సార్లు కేసీఆర్ పేరు జపం చేశారన్నారు. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్​ఏ అన్నారు. మూసీ నది మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి ఎక్కువన్నారు. కేసీఆర్ కల్పవృక్షమని, రేవంత్ రెడ్డియే కలుపు మొక్కని అభివర్ణించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమను ప్రజలు వంద సీట్లల్లో గెలిపిస్తారన్నారు. 

11 నెలల్లో 42 మంది విద్యార్థుల మృతి

రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో అసలు ఏం జరుగుతున్నదని హరీశ్ రావు ప్రశ్నించారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని బుధవారం ఎక్స్​లో పోస్ట్ చేశారు. ‘‘నారాయణ పేట జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.

పాఠాలు నేర్చుకోవడం కాదు.. గురుకులాల నుంచి ప్రాణాలతో బయటపడితేచాలు అనే పరిస్థితిని కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేవంత్.. ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలి?’’ అని అన్నారు.