జనసేన సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన లేకుండా టీడీపీ గెలవలేదని అన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 40 సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలు 24సీట్లు మాత్రమే కేటాయించటంతో ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. శత్రువులు ఎవరో, మిత్రులెవరో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని అన్నారు. తనని దూరం పెట్టినా కూడా పవన్ వెంటే ఉంటానని, పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవటం తన విధి అని పవన్ కి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య.
పవన్ కళ్యాణ్ కి ఇష్టం ఉన్నా లేకున్నా తన వెంటే ఉంటానని, చచ్చేవరకూ తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవటం తన బాధ్యత అని అన్నారు. ప్యాకేజ్ వీరుడంటూ పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పేముందని, తనని వైసీపీ కోవర్ట్ గా చిత్రీకరిస్తున్నారని అన్నారు.
హరిరామజోగయ్య గత కొంత కాలంగా పవన్ కి బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్నాడు. ఇటీవల జరిగిన తాడేపల్లిగూడెం టీడీపీ, జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ కొంతమంది పెద్దలు తనకు సలహాలు ఇవ్వటం మానుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు బదులుగా హరిరామజోగయ్య ఈ లేఖ రాసినట్లు అనిపిస్తోంది.