Syed Mushtaq Ali Trophy: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. హార్దిక్‌కి ఇక్కడ కూడా కెప్టెన్సీ ఇవ్వలేదు

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య దేశవాళీ క్రికెట్ బాట పట్టాడు. ఐదేళ్ల తర్వాత అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. నవంబర్ 23 నుంచి జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత టెస్ట్ జట్టును మినహాయిస్తే మిగిలిన ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో ఆడబోతున్నారు. తన అన్న కృనాల్ పాండ్యా కెప్టెన్సీలో హార్దిక్ ఆడడం విశేషం. 

బరోడా తరపున హార్దిక్ చివరిసారిగా 2018-19 రంజీ ట్రోఫీ సీజన్‌లో కనిపించాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విషయానికి వస్తే 2016 జనవరిలో ఈ టోర్నీ ఆడాడు. 2016 సీజన్ ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ లో పాండ్య  కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో ఐపీఎల్ బాగా ఆడడంతో భారత జట్టులో అతనికి స్థానం లభించింది. కొన్నేళ్లుగా పాండ్య దేశవాళీ క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే బీసీసీఐ ఆటగాళ్లు ఖాళీగా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించింది. దీంతో పాండ్య ముస్తాక్ అలీ ట్రోఫీకి సిద్ధమయ్యాడు. 

భారత దేశవాళీ క్రికెట్ లో టీ20 ఫార్మాట్ లో జరగబోయే ఈ ట్రోఫీకి మంచి పాపులారిటీ ఉంది. ఈ మెగా ట్రోఫీకి ఒక మ్యాచ్ లో పాండ్యా సోదరులను చూడడం అభిమానవులకు ఒక ట్రీట్‌గా ఉండడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వలేదు. దీంతో అతని ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఇటీవలే భారత కెప్టెన్సీ నుంచి తప్పించిన పాండ్యకు బరోడా కెప్టెన్సీ లభించలేదని బాధపడుతున్నారు. అయితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు పాండ్య కెప్టెన్సీ చేయడం అతని ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశం.