IND vs AUS: ఫామ్‌లో ఉన్నా అతడు ప్లేయింగ్ 11లో పనికిరాడు: భారత మాజీ స్పిన్నర్

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్  రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. వీరిద్దరూ ఆదివారం (డిసెంబర్ 1) ఆసీస్ కుర్రాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్ లో బరిలోకి దిగారు. 

అంతా బాగానే ఉన్నా బ్యాటింగ్ ఆర్డర్ పై భారత్ గందరగోళంగా ఉంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్, గిల్ జట్టులో చేరడంతో పడికల్, జురెల్ బెంచ్ కు పరిమితం కానున్నారు. అయితే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్..రెండో టెస్టుకు ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ లో సలహాలు ఇచ్చాడు. ఈ మ్యాచ్ కోసం ఫామ్ లో ఉన్నప్పటికీ శుభమాన్ గిల్ ను పక్కన పెట్టాలని అతను చెప్పాడు. అదే సమయంలో జురెల్ కు మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు. 

హర్భజన్ మాట్లాడుతూ.. "గిల్ అవకాశం కోసం వేచి ఉండాల్సింది అని నేను భావిస్తున్నాను. జురెల్‌ను ఒక మ్యాచ్‌ ఆడించి పరుగులు చేయకపోతే పక్కన పెట్టారు. గిల్ ఓపెనింగ్ స్థానం నుంచి 5 వ స్థానం వరకు ఎక్కడైనా ఆడే సామర్ధ్యత లేదు. జురెల్ కంటే గిల్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను" అని ఈ టీమిండియా మాజీ స్పిన్నర్ అన్నాడు. 

తొలి టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రాహుల్, జైశ్వాల్ రెండో టెస్టుకు ఓపెనింగ్ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ వస్తారు. మూడో ప్లేస్ లో కెప్టెన్ రోహిత్ వస్తే గిల్ 6 వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఓపెనింగ్ స్లాట్ ను త్యాగం చేసిన రోహిత్.. గిల్ కోసం మూడో స్థానం అప్పగిస్తే హిట్ మ్యాన్ ఆరో స్థానంలో దిగడం తప్ప ఎలాంటి ఆప్షన్ లేదు. ఇటీవలే ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగిన మ్యాచ్ లో జైశ్వాల్, రాహుల్ ఓపెనింగ్ చేయగా.. ఎప్పటిలాగే గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. రోహిత్ 4 స్థానంలో ఆడాడు.