- సిటీలో ట్రాఫిక్ డ్యూటీల్లోకి 39 మంది ట్రాన్స్ జెండర్లు
- సమాజం, ఫ్యామిలీలో రెస్పెక్ట్ పెరిగిందంటూ సంతోషం
- ఐదురోజుల అనుభవాన్ని ‘వెలుగు’తో పంచుకున్న ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మొన్నటి వరకు వాళ్లు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర డబ్బుల కోసం చేయి చాచారు. పెండ్లి, గృహ ప్రవేశం, బోనాలు లాంటి కార్యక్రమాల్లో భిక్షమెత్తుకోకుంటే వారి నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేవి కావు. అలాంటి వారి కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వారి జీవితాలనే మార్చేసింది. అడుక్కోవడం తప్ప మేమేం చేయలేమనే నిస్సహాయస్థితిలో ఉన్నవారికి.. అందరితో మీరూ సమానమే.. అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు అనే భరోసా కల్పించింది. హైదరాబాద్మహానగరంలో వారికి కల్పించిన ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం వారికి సమాజంలో ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ఎక్కడైతే డబ్బుల కోసం వాహనదారుల వద్ద వాళ్లు చేయిచాచారో.. అదే చోట, అదే వాహనదారులకు వారు ప్రస్తుతం దారి చూపిస్తున్నారు. దీంతో తాము తమ కుటుంబాలు, బంధువుల మధ్య తలెత్తుకొని తిరుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మనసుతో తమకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించిన కాంగ్రెస్‌ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి..
హైదరాబాద్ సిటీలో పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని.. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ డ్యూటీల్లో భాగం చెయ్యాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా పోలీసు అధికారులు ఆసక్తి కలిగిన 44 మంది ట్రాన్స్ జెండర్లను పిలిపించి.. నవంబర్ లో 20 రోజులపాటు ట్రాఫిక్ నిబంధనలపై ట్రైనింగ్ ఇచ్చారు. రాత పరీక్షలు, ఈవెంట్స్ కండక్ట్ చేసి.. 39 మందిని ఫైనల్ చేశారు. వారికి ఈ నెల 23న ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అపాయింట్మెంట్ లెటర్లు అందించారు.
హైదరాబాద్ సిటీలోని ప్రతీ పోలీసు స్టేషన్ కు ఇద్దరి చొప్పున డ్యూటీలు కేటాయించారు. వారంతా.. 24వ తేదీ నుంచి డ్యూటీల్లో జాయిన్ అయ్యి.. ట్రాఫిక్ పోలీసులతో తామేమీ తక్కువ కాదన్న రీతిలో సేవలందిస్తున్నారు. ‘‘థర్డ్ జెండర్ గా.. సమాజంలో వివిధ రకాల అవమానాలు, ఇబ్బందులకు గురయ్యాం. ఫ్యామిలీలో, చుట్టాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం.. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో గర్వంగా ఉద్యోగం చేస్తున్నాం. మేం చదివిన చదువు, సాధించిన సర్టిఫికెట్లు ఎందుకూ పనికిరావు అనుకున్న సమయంలో ఇలాంటి ఉద్యోగం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది”అంటూ వారి ఫీలింగ్స్ ను ‘వెలుగు పత్రిక’తో పంచుకున్నారు.
ఆరేండ్ల తర్వాత ఇంటి నుంచి అమ్మనాన్న ఫోన్ చేశారు
నాకు ఉద్యోగం వచ్చిందని న్యూస్ లో చూసి.. మా అమ్మా, నాన్న ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. చాలా సంతోషమ నిపించింది. ఆరేండ్ల కిందట పదో తరగతిలో ట్ర్సాన్స్ జెండర్‌గా మారిన నన్ను మా వాళ్లు ఇంటికి రానివ్వలేదు. అలాంటిది ఇవ్వాల రమ్మంటున్నరు. అంటే ఈ ఉద్యోగం నా మీద రెస్పెక్ట్ పెంచిందని అర్థమవుతోంది.
నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే నా స్కూల్ మేట్స్, రిలేషన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఉద్యోగం రాకముందు నేను బోనాలు ఎత్తేది. పరిస్థితి ఎలా ఉన్నా చదువు మీద శ్రద్ధ తగ్గేది కాదు. ఇప్పుడు డిగ్రీ సెకండియర్ చదువుతున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఎస్సై అవ్వాలనేది నా లక్ష్యం. ఈ ఉద్యోగం ఇచ్చిన రేవంత్ సార్‌కు థ్యాంక్స్. సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కి కూడా థ్యాంక్స్. – స్వాతి, సంగారెడ్డి
సర్టిఫికెట్స్ వేస్ట్ అవుతాయనుకున్న
ట్రాఫిక్ అసిస్టెంట్ డ్యూటీ చేయడం చాలా గర్వంగా ఉంది. చదువుకున్న సర్టిఫికెట్స్ వేస్ట్ అవుతాయనుకున్న సమయంలో ఉద్యోగం రావడంతో ఆ సర్టిఫికెట్లు యూజ్ అయిన ఫీలింగ్ కలిగింది. జాబ్ ట్రైనింగ్ లో ఈవెంట్ లో సెలెక్ట్ అయిన. 800 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్.. ఇలా 20 రోజులపాటు మాకు ట్రైనింగ్ ఇచ్చి, అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. డిపార్ట్ మెంట్ వారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. భవిష్యత్తులో మా క్వాలిఫికేషన్స్ కు తగిన ఉద్యోగాలు కూడా వస్తాయని ఆశిస్తున్నాం. – శ్రీజ, మహబూబ్ నగర్
రెస్పెక్ట్ పెరిగింది
సీఎం గారి నిర్ణయం చాలా బాగుంది. సిగ్నల్స్ దగ్గర ఒకప్పుడు ఆడుకునే వాళ్లం. ఇవాళ అదే సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నందుకు గర్విస్తున్నం. మా ఫ్యామిలీలో, విలేజ్‌లో మాకు రెస్పెక్ట్ పెరిగింది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నేను లావుగా ఉన్నానని ట్రైనింగ్ సరిగా చేస్తదా? అని చాలామంది కామెంట్ చేశారు. కానీ, అన్నింట్లో నేనే ఫస్ట్ వచ్చాను. ఈరోజు సిటీలో ట్రాఫిక్ అసిస్టెంట్ గా డ్యూటీ చేస్తున్నాను. భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నా. – మహాలక్ష్మి, నర్సింగ్ రావు పల్లి తండా, మెదక్
చాలా మందికి అవకాశం ఇవ్వాలి
పోలీస్ డ్రెస్ వేసుకొని ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ట్రాన్స్ జెండర్లు అంటే శుభకార్యాల్లో డబ్బులు వసూలు చేస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ, అందులో మంచి చెడు కూడా ఉంటాయి. మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ నుంచి మరో వెయ్యి మందికి ఇలాంటి జాబ్స్ వస్తే మాకు ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం ఇచ్చి, మాకు సపోర్ట్ గా నిలిచిన సీఎం గారికి థ్యాంక్స్.– అభినేత్రి, ఆరుట్ల , ఇబ్రహీంపట్నం