సపోటా పండుతో ఆరోగ్యానికి బోలెడు లాభం ఉంది. అలాగని ఎన్ని పండ్లు తింటాం అనుకునేవాళ్లు సపోటాలతో వెరైటీ రెసిపీస్ చేసుకుని తినొచ్చు. సపోటాతో ఏం రెసిపీస్ ఉంటాయి? మహా అయితే స్మూతీ, జ్యూస్‌లాంటివి తప్ప అంటున్నారా! ఆ స్మూతీ, జ్యూస్‌లతో పాటు హల్వా, డెజర్ట్, కేక్, రవ్వలడ్డు, కుల్ఫీ వంటివి చేయొచ్చు. అదెలాగో చదివి, చేసుకుని ఎంజాయ్ చేయండి.
సపోటా రవ్వ లడ్డు
కావాల్సినవి :
సపోటాలు - ఆరు
బొంబాయి(ఉప్మా) రవ్వ - అర కప్పు
బెల్లం - పావు కప్పు
బాదం తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పులు - ఒక టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష - ఒక టేబుల్ స్పూన్
నెయ్యి - రెండు టీస్పూన్లు
నూనె - ఒక టేబుల్ స్పూన్
యాలకుల పొడి - ఒక టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాలి. నెయ్యి వేడిచేసి అందులో బాదం, జీడిపప్పు తరుగు, ఎండు ద్రాక్ష వేగించాలి. తర్వాత వాటిని పక్కకు తీసి అదే పాన్‌లో బొంబాయి రవ్వ వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత మిక్సీజార్‌లో సపోటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కూడా మరో పాన్‌లో వేగించాలి. తరువాత అందులో బెల్లం నీళ్లు పోసి కలపాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక యాలకుల పొడి వేయాలి. దాంతోపాటు వేగించిన బొంబాయి రవ్వ, డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న ఉండలు కడితే సపోటా రవ్వ లడ్డు రెడీ.
సపోటా డెజర్ట్
కావాల్సినవి :
సపోటాలు - నాలుగు
కర్జూరాలు - ఆరు
పాలు - అర లీటర్
చక్కెర - రెండు వందల గ్రాములు
కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూన్
పాల పొడి - రెండు టీస్పూన్లు
తయారీ : సపోటాల తొక్క, గింజలు తీసేసి తరగాలి. కర్జూరాల గింజలు తీసి తరగాలి. కర్జూర, సపోటా ముక్కలను మిక్సీజార్‌లో వేయాలి. అందులో రెండు టీస్పూన్ల పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అరలీటర్ పాలు పావు లీటర్ అయ్యేవరకు కాగబెట్టాలి. ఆ పాలలో కార్న్ ఫ్లోర్ కలపాలి. (కార్న్‌ఫ్లోర్ బదులు కస్టర్డ్ పౌడర్ కూడా వాడొచ్చు.) ఆ తరువాత మిల్క్ పౌడర్ కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు కలుపుతూనే ఉండాలి. మిశ్రమం దగ్గర పడిన తరువాత సపోటా, కర్జూర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి మూత పెట్టి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.
సపోటా స్మూతీ
కావాల్సినవి :
సపోటాలు - రెండు
బాదం తరుగు - ఒక టీస్పూన్
తేనె - ఒక టీస్పూన్
నీళ్లు - సరిపడా
పెరుగు - ఒక కప్పు
అవిసె గింజలు - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - ఒక కప్పు
తయారీ : సపోటాల తొక్క, గింజలు తీసేయాలి. తరువాత ముక్కలు తరిగి మిక్సీజార్‌లో వేయాలి. వాటితోపాటు పెరుగు, అవిసె గింజలు, బాదం తరుగు, తేనె వేయాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గ్లాస్లో పోసి అవిసె గింజలు, బాదం పలుకులు చల్లి, తేనెతో డెకరేట్ చేస్తే టేస్టీ, హెల్దీ సపోటా స్మూతీ రెడీ.
సపోటా హల్వా
కావాల్సినవి :
సపోటాలు – పదిహేను
కోవా – ఒక కప్పు
నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు
చక్కెర – అర కప్పు
పాలు – రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు – చిటికెడు
యాలకుల పొడి – ఒక టీస్పూన్
బాదం, జీడిపప్పు తరుగు – సరిపడా
తయారీ : సపోటాలను తొక్క తీసి, తురమాలి. పాన్‌లో నెయ్యి వేడిచేసి కోవా వేయాలి. అది మెత్తగా అయ్యేవరకు ఉడికించి ఒక ప్లేట్లోకి తీయాలి. అదే పాన్‌లో మరికాస్త నెయ్యి వేడి చేసి అందులో సపోటా గుజ్జు వేసి ఉడికించాలి. తర్వాత అందులో కోవా వేసి కలపాలి. ఒక గిన్నెలో కొన్ని పాలు పోసి కుంకుమ పువ్వు నానబెట్టాలి. ఈ పాలను సపోటా మిశ్రమంలో పోసి కలపాలి. ఆ తర్వాత చక్కెర వేసి అది కరిగేవరకు కలపాలి. చివరిగా యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల తరుగు వేసి మళ్లీ ఒకసారి కలిపితే హల్వా రెడీ.
సపోటా కుల్ఫీ
కావాల్సినవి :
పాలు - ఒక లీటర్
సపోటాలు - ఆరు
చక్కెర - ఎనిమిది టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో లీటర్ పాలు కాగబెట్టాలి. పాలు మరిగేటప్పుడు చక్కెర వేసి కలపాలి. లీటర్ పాలు బాగా మరిగి అరలీటర్ అయ్యాక వాటిని చల్లార్చాలి. జ్యూస్ జార్లో పాలు పోసి, సపోటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ గ్లాస్లో పోసి, గాలి చొరబడకుండా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎనిమిది గంటల తర్వాత తీసి తింటే వారెవ్వా కుల్ఫీ అనాల్సిందే.
సపోటా కేక్
కావాల్సినవి :
సపోటాలు - ఐదు
మైదా పిండి - ఒక కప్పు
బెల్లం (కరిగించి) - ఒక కప్పు
పాలు - అర కప్పు
నూనె - అర కప్పు
బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూన్
బేకింగ్ సోడా - ఒక టీస్పూన్
నూనె - అర కప్పు
వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్
తయారీ : సపోటాల తొక్క, గింజలు తీసి ముక్కలు తరగాలి. మిక్సీజార్‌లో సపోటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో కరిగించిన బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. నూనె, పాలు, వెనీలా ఎసెన్స్ ఒక్కోటిగా వేస్తూ అన్నీ బాగా కలిసేలా మరోసారి కలపాలి. ఒక ప్లేట్ లేదా గిన్నెకి నెయ్యి పూసి రెడీ చేసిన మిశ్రమం అందులో వేయాలి. కేక్‌ని బేక్ చేయడం కోసం పాన్ వేడి చేసి అందులో ఒక ప్యాకెట్ రాతి ఉప్పు వేసి పాన్ అంతా పరవాలి. దానిపై ఒక స్టాండ్ పెట్టి అందులో కేక్ మిశ్రమం ఉన్న ప్లేట్ పెట్టి దానిపై మూతపెట్టాలి. ముప్పావుగంట ఉడికాక కాసేపు చల్లారబెట్టాలి. ఆపై ముక్కలుగా కట్‌చేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది.