హెయిర్‌‌ స్టైలిస్ట్ జావెద్ హబీబ్‌పై కేసు

హెయిర్‌‌ స్టైలిస్ట్ జావెద్ హబీబ్‌పై కేసు

ప్రముఖ హెయిర్‌‌ స్టైలిస్ట్ జావెద్ హబీబ్‌పై ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ కేసు నమోదైంది. వెస్ట్రన్ యూపీ ముజఫర్‌‌నగర్‌‌లో సోమవారం జరిగిన హెయిర్ స్టైలింగ్‌ వర్క్‌ షాప్‌లో ఆయన.. పూజా గుప్తా అనే మహిళ నెత్తిపై ఉమ్మిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోలు ఆయన మాట్లాడుతూ హెయిర్ స్టైలింగ్‌లో నీళ్లు అందుబాటులో లేనప్పుడు ఉమ్మిని వాడొచ్చంటూ చెప్పడం వివాదాస్పదంగా మారింది. దీనిని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గమనించిన పూజాతో పాటు మహిళా సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జావెద్ తీరుపై పూజా కేసు కూడా పెట్టింది. మరోవైపు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్.. యూపీ పోలీసుల నుంచి వివరణ కోరింది. దీనిని పరిశీలించిన పోలీసులు.. జావెద్ హబీబ్‌పై డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ కింద కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు.

జావెద్ క్షమాపణలు

ఈ ఘటనపై జావెద్ హబీబ్‌కు జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. దీంతో అతడు క్షమాపణలు చెప్పారు. అయితే ఇలా ఎందుకు చేయాలో వివరిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. తమ వర్క్‌ షాప్స్‌లో చాలా సుదీర్ఘంగా ప్రొఫెషనల్‌గా జరుగుతుంటాయని, అయితే కొంత సరదాగా ఉండడం కోసం హెయిర్‌‌ స్టైలింగ్‌లో నీళ్ల కొరత ఉంటే ఉమ్మిని వాడొచ్చని ఆ సమయంలో చెప్పానని అన్నారు. ఇది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నానని అన్నారు.