NZ vs ENG: అట్కిన్సన్ అదరహో.. టెస్టుల్లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ హ్యాట్రిక్

వెల్లింగ్ టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గుస్ అట్కిన్సన్ హ్యాట్రిక్ సాధించాడు. శనివారం (డిసెంబరు 7) రెండో రోజు ఆటలో భాగంగా అతను ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్లో మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, మాజీ కెప్టెన్ టిమ్ సౌథీని ఔట్ చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ తరపున హ్యాట్రిక్ తీసిన 15 వ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. 

తొలి ఇన్నింగ్స్ లో అట్కిన్సన్ మొత్తం 8.5 ఓవర్లలో 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో పాటు అంతకముందు కాన్వే వికెట్ పడగొట్టాడు. జూన్ 2021 తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా అట్కిన్సన్ నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ కీరన్ పావెల్, జాసన్ హోల్డర్, జాషువా డాసిల్వాలను అవుట్ చేసి టెస్ట్ క్రికెట్‌లో చివరి హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. అట్కిన్సన్ కంటే ముందు మొయిన్ అలీ టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన చివరి ఇంగ్లాండ్ ఆటగాడు.

Also Read:-మెరుపు సెంచరీతో చెలరేగిన SRH మాజీ ప్లేయర్..

ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ తో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తుంది. రెండో రోజు చివరి సెషన్ లో 5 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 516 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 280 పరుగులకు ఆలౌట్ అయింది.