గుజరాత్​లో భర్తపై ఏడుసార్లు కేసుపెట్టి విడిపించిన భార్య

 గుజరాత్​లో భర్తపై ఏడుసార్లు కేసుపెట్టి విడిపించిన భార్య

అహ్మదాబాద్: భర్త తనను కొడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించి గృహ హింస కేసుపెట్టిందో మహిళ.. కోర్టు ఆదేశాలతో ఆ భర్త జైలుపాలయ్యాడు. దీంతో మళ్లీ ఆ భార్యే జామీను ఇచ్చి బయటకు తీసుకొచ్చింది. ఒక సారి, రెండు సార్లు కాదు.. పదేండ్లలో ఏడుసార్లు ఇలాగే జరిగింది. భర్త కొట్టడంతోనో, నెలనెలా పంపాల్సిన సొమ్ము పంపకపోతేనో ఆ భార్య పోలీస్ స్టేషన్​కు వెళ్లడం, వాళ్లు వచ్చి సదరు భర్తను జైలుకు పంపించడం.. పదేండ్లుగా ఇలాగే జరుగుతోందట. గుజరాత్​లోని మెహసానా జిల్లాలో కాడి టౌన్​లో నివసించే ప్రేమ్​చంద్​, సోను దంపతుల వింత కథ ఇది.

గృహహింస కేసు..

ప్రేమ్​చంద్, సోను దంపతులకు 2001లో పెండ్లి జరిగింది. కొన్నాళ్లు బాగానే సాగిన వాళ్ల కాపురంలో 2014 నుంచి గొడవలు స్టార్ట్​ అయ్యాయి. ఏడాది సహనంతో భరించిన సోను.. 2015లో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు గృహహింస కేసు పెట్టి ప్రేమ్​ చంద్​ను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో తాము కలిసి ఉండలేమని చెప్పడంతో ఇద్దరినీ విడివిడిగా ఉండాలని జడ్జి సూచించారు. సోను పోషణ నిమిత్తం నెలకు రూ.2 వేలు పంపించాలని ప్రేమ్​చంద్​ను ఆదేశించారు. నెలనెలా ఆ మొత్తం ఇవ్వకపోతే జైలుకు పంపించాలంటూ పోలీసులకు ఆదేశించారు. కూలీ అయిన ప్రేమ్​చంద్ భార్యకు డబ్బులు ఇవ్వలేక 2016 నుంచి 2020 వరకు పలుమార్లు జైలుకు వెళ్లాడు.

పర్సు, వాచీ విషయంలో గొడవ

ఒకసారి  ప్రేమ్​చంద్ 5 నెలలు లోపలే ఉన్నా డు. మళ్లీ సోను కల్పించుకుని జామీను ఇచ్చి విడి పించింది. కొన్ని రోజులు కలిసి ఉన్నాక మళ్లీ గొడవ కావడంతో సోను మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రేమ్​ చంద్ మళ్లీ జైలుకెళ్లాడు. సోను మరోమారు జామీను ఇచ్చి ప్రేమ్​ చంద్​ను విడిపించింది. ఇలా ఈ పదేండ్ల కాలంలో ఏడుసార్లు ప్రేమ్​చంద్ జైలుకు వెళ్ల గా.. సోనూయే విడిపించి బయటకు తీసుకొచ్చింది. ఈ నెల 4న కూడా అదేవిధంగా ప్రేమ్​ చంద్​ను విడిపించింది. ఇద్దరూ ఇంటికి వెళ్లాక తన పర్సు, వాచీ కనిపించడంలేదని సోనుతో ప్రేమ్​చంద్​ గొడవ పడ్డాడు. ఇదికాస్తా ముదిరి ఇద్దరూ కొట్టుకున్నారు. ఆపై తన భార్య సోను, కొడుకుతో కలిసి తనకు హాని చేయాలని ప్రయత్నిస్తోందని ప్రేమ్​చంద్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై భార్యతో కలిసి ఉండేది లేదని  తన తల్లి ఇంటికి వెళ్లిపోయాడు.