దుకాణ సముదాయాలకు నిధులు విడుదల చేయండి : ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజక వర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​లో కొత్తగా నిర్మిస్తున్న దుకాణ సముదాయాలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. 

అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.20. 40 లక్షల రూపాయల వ్యయంతో 168 దుకాణాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. నిధుల కొరతతో పనులు మధ్యలోనే నిలిచాయని  వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి  సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.