న్యూఢిల్లీ: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ శుక్రవారం జరగనుంది. జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్కోసం ఏర్పాటయిన మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌కు సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ మార్పు ప్రపోజల్స్‌ను కూడా ఇందులో డిస్కస్ చేస్తారు. 46 వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ న్యూఢిల్లీలో డిసెంబర్ 31 న జరగనుందని ఒక ఆఫీసర్ చెప్పారు. ఉదయం 11 గంటలకు మీటింగ్ మొదలవుతుందని తెలిపారు. గార్మెంట్స్, చెప్పులు, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుపై వివిధ రాష్ట్రాలు అభ్యంతరాలు ప్రకటించడంతో వాటిని కూడా మీటింగ్‌లో సమీక్షించనున్నారు.
టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీని 12 శాతానికి పెంచడం తగదని వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అమిత్ మిత్రా చెప్పారు. దీనిని మళ్లీ 5 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఈ పెంపుదల వల్ల లక్ష యూనిట్లు మూతపడతాయని, 15 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని మిత్రా చెప్పారు. ఇటీవల ప్రకటించిన జీఎస్టీ పెంపుదలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఇండస్ట్రీస్ మినిస్టర్ కే టీ రామారావు కూడా కోరారు. టెక్స్టైల్స్, గార్మెంట్స్‌పై జీఎస్టీ పెంచడాన్ని ఆ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పేదలకు బట్టలు ఖరీదవడంతోపాటు, తమ కంప్లయెన్స్ ఖర్చులూ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చేనేత వర్గాల నుంచీ పెంపుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ. వెయ్యిలోపు చెప్పులపై జీఎస్టీ పెంపు ప్రపోజల్ వాయిదాపై కూడా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చ జరగనుంది.
