న్యూఢిల్లీ: ఎకానమీని పరుగుపెట్టించడానికి చర్యలను కొనసాగిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రకటించారు. ఇది వరకు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జీఎస్టీ రేట్ల పెరుగుదలపై వస్తున్న సమాచారం అంతా పుకార్లేనని, ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మన ఎకానమీ ‘స్టాగ్‌ఫ్లేషన్’ దశలోకి వెళ్తుందా ? అన్నకు ప్రశ్నకు బదులిస్తూ ఆర్థిక వ్యవస్థ బాగుకోసం ఇక ముందు ఏమేం చర్యలు తీసుకోవాలనేదే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, ధరలు పెరగడం, ఆర్థికవృద్ధి తక్కువగా ఉండటాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. అయితే డిమాండ్ లేక ఇబ్బంది పడుతున్న కొన్ని సెక్టర్లకు తమ వంతు సాయం చేశామని ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రకటించారు. తమ చర్యలు తగిన ఫలితాలు ఇవ్వకుంటే మరిన్ని చర్యలు ఉంటాయన్నారు.
మంత్రి నిర్మల స్పీచ్‌లోని ముఖ్యాంశాలు:
జీఎస్టీ శ్లాబులను పెంచుతారంటూ మీడియాలో సమాచారం వస్తోంది కానీ ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోలేదు. పెంపుపై జీఎస్టీ మండలిలో చర్చలు కూడా మొదలుకాలేదు. ఆగస్టు నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ సెస్ బకాయిపడ్డాం. త్వరలోనే వీటిని చెల్లిస్తాం.
పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తాం. దివాలా చట్టంపై సత్వరం స్పందించాం. సోమవారం నుంచి బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు ప్రారంభమవుతాయి.
ఉల్లిపాయల ధరలను అదుపులోకి తేవడానికి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా మంత్రుల బృందం రెండు రోజులకు ఒకసారి సమావేశమవుతోంది. మార్కెట్లకు ఉల్లి సరఫరాను పెంచుతాం. ఇందుకోసం దిగుమతులనూ పెంచుతాం.
ఇన్వెస్ట్‌మెంట్లను పెంచడానికి, రియల్ ఎస్టేట్‌కు సాయం చేయడానికి, బ్యాంకులకు మరింత క్యాపిటల్ ఇవ్వడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాం. మార్కెట్లోకి మరింత లిక్విడిటీ వచ్చేలా చేయడానికి 32 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందాల్సిన బకాయిల్లో 60 శాతం నిధులను విడుదల చేశాం.
ఆర్‌బీఐ కొత్త రూల్స్ ప్రకారం ఈ ఏడాది రూ.8 లక్షల కోట్ల విలువైన లోన్లు మంజూరు చేశాం. బ్యాంకులకు రూ.60 వేల కోట్ల క్యాపిటల్ ఇచ్చాం. బ్యాంకులు కార్పొరేట్లకు రూ.2.2 లక్షల కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.73 వేల కోట్ల విలువైన లోన్లు ఇచ్చాయి.

