- నా థర్డ్ టర్మ్ లో ప్రపంచ టాప్-3 ఎకానమీగా ఇండియా నిలుస్తుంది: మోదీ
- వచ్చే ఏడాది నుంచి మరింత వేగంగా వృద్ధిరేటు
- ఢిల్లీలో ‘భారత్ మండపం’ ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశం అభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఏడాది మూడోసారి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రోత్ రేట్ మరింత అనూహ్యంగా ఉంటుందన్నారు. ‘‘ఫస్ట్ టర్మ్ లో నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇండియా ప్రపంచ అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో 10వ స్థానంలో ఉండేది. నా సెకండ్ టర్మ్ లో ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుత ట్రాక్ రికార్డ్ ప్రకారం చూస్తే.. నా థర్డ్ టర్మ్ లో దేశం ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో 3వ స్థానానికి చేరడం ఖాయం.
ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ” అని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్మించిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ ను బుధవారం ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ‘‘ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు.. నార్త్ నుంచి సౌత్ వరకూ.. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ బ్రిడ్జి ఇప్పుడు మన దేశంలోనే ఉంది. అతిఎత్తయిన ప్రాంతంలోని అతిపొడవైన టన్నెల్, అతిఎత్తయిన రోడ్డు, అతిపెద్ద స్టేడియం, అతిపెద్ద విగ్రహం కూడా ఇండియాలోనే ఉన్నాయి” అని ఆయన చెప్పారు. ఢిల్లీలో త్వరలోనే ‘యుగే యుగే భారత్ నేషనల్ మ్యూజియం’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు అవుతుందన్నారు.
25 ఏండ్లలో అభివృద్ధి చెందిన ఇండియా
గత 60 ఏండ్లలో దేశంలో కేవలం 20 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు మాత్రమే నిర్మించగా.. తన హయాంలో కేవలం 9 ఏండ్లలోనే 40 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు నిర్మించామని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం ప్రతి నెలా 6 లోమీటర్ల మెట్రో లైన్ పూర్తి చేస్తున్నామన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు కెపాసిటీ ఏటా 5 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 7.5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా మార్చామన్నారు. దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్యను కూడా పెంచామన్నారు. 2014లో 60 సిటీల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ అందేదని, ఇప్పుడు 600 సిటీలు, టౌన్లలో దీనిని అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ రిపోర్ట్ తేల్చిందని, వచ్చే 25 ఏండ్లలో ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారడం ఖాయమన్నారు.
మంచి పనులను అడ్డుకుంటున్నరు
దేశంలో కొందరికి మంచి పనులను అడ్డుకోవడమే పనిగా మారిందంటూ ప్రతిపక్షాలపై మోదీ పరోక్షంగా ఫైర్ అయ్యారు. ‘‘వాళ్లు కర్తవ్యపథ్ రీమోడలింగ్ ను వ్యతిరేకించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా దానిని మెచ్చుకుంటున్నారు. అలాగే భారత్ మండపాన్ని కూడా అడ్డుకోవాలని చూశారు. కేసులు కూడా వేయించారు. వాళ్లే కొన్నాళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి ఈ వేదికపై నుంచే లెక్చర్లు ఇస్తారు” అని ఆయన విమర్శించారు. భారత్ మండపం వంటి వాటిని దశాబ్దాల కిందటే కట్టాల్సి ఉందని, కానీ తాను వచ్చాకే ఆ పనిని భుజాలకు ఎత్తుకున్నానని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ లో జీ20 సమిట్ కు భారత్ మండపమే వేదికగా నిలుస్తుందన్నారు.
బసవేశ్వరుడి అనుభవ మండపమే స్ఫూర్తి
ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌ను పునరుద్ధరిస్తూ123 ఎకరాల్లో నిర్మించిన కాంప్లెక్స్‌కు భారత్ మండపంగా పేరుపెట్టామని మోదీ ప్రకటించారు. కర్నాటకలోని బీదర్ జిల్లాలోని లార్డ్ బసవేశ్వరుడి అనుభవ మండపం స్ఫూర్తితో దీనిని నిర్మించామని వెల్లడించారు. 12వ శతాబ్దం నాటి అనుభవ మండపం ప్రపంచంలోనే తొలి రిలీజియస్ పార్లమెంట్‌గా గుర్తింపు పొందిందన్నారు.
