Telangana: కుమ్ములాటల్లో కమలదళం

తెలంగాణలో  బీజేపీకి ఏదో  వైరస్ సోకినట్టుంది. పాత, కొత్త నీటి  కలయిక కుదురుకోవటం లేదు.  పార్టీ మూలవాసులకు, వలస నేతలకు మధ్య సయోధ్యకు బదులు సంకుల సమరమే సాగుతోంది. స్వార్థం, అలసత్వం, ముఠాతత్వం.. అంతటా  ముప్పిరిగొంటున్నాయి. వ్యాధి సంస్థాగత  ఎన్నికలకూ పాకి,  ప్రక్రియ  ఓ ప్రహసనంగా  మారుతోంది.  ముఠాతత్వం తారస్థాయికి చేరి,  గ్రూప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. 

రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా.. ప్రజాక్షేత్రంలో పార్టీ రోజురోజుకూ వన్నె తగ్గుతోందే తప్ప పుంజుకోవటం లేదు. బీజేపీ సంస్థాగత ప్రగతి ‘ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి’ అన్నట్టుంది. రాష్ట్ర  కొత్త అధ్యక్షుడ్ని నియమించలేక అధిష్టానానికి పాలుపోని సంకటం ఒకవైపు,  గిల్లికజ్జాలకు దిగే పార్టీ  ముఖ్యుల్ని  సమన్వయపరచలేక  మాతృసంస్థ  ఆర్ఎస్ఎస్​ తలపట్టుకుంటున్న స్థితి  మరోవైపు!  లోక్​సభ  ఎన్నికల్లో  ప్రజలు  అసాధారణ మద్దతు జోడిస్తున్నా, దాన్ని  నిలుపుకోలేని దుస్థితి నాయకత్వపు స్వయంకృతాపరాధమేనని సగటు కార్యకర్త గింజుకుంటున్న పరిస్థితి!

ఎన్నికలు,  ప్రజాకార్యక్రమాలు, సభలు, -సమావేశాలు, చివరకు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ.. అంతటా ముఠా తగాదాలే!  తెలంగాణ రాష్ట్రంలో ఇపుడు బీజేపీ ఒకటిగా లేదు.  రెండు గ్రూపులు,  పది ఆలోచనలు, భిన్న క్యాంపులు,  విభిన్న భావధారలుగా ఉంది.  ఏ పని చేసినా,  దానివల్ల  పార్టీకి  ఎంతమేలు?  ఏం ప్రయోజనం? అని కాకుండా, ‘నాకేంటి?’   ‘ఇది చేయడం వల్ల నేనెంత ప్రొజెక్ట్ అవుతాను?’  అనే  దృష్టికోణంలోనే నేతల స్వార్థ వ్యవహారాలు సాగుతున్నాయనే అభిప్రాయం ఉంది.

మూలమే ప్రహసనం!

ఎన్నికల్లో పోటీకి అరువు అభ్యర్థుల్ని తెచ్చుకున్నట్టే పార్టీ సభ్యత్వ నమోదుకు  కిరాయి  కార్యకర్తల్ని  తెచ్చుకుంటున్నారు. అయినా.. లక్ష్యాలకు ఆమడదూరంలోనే ఉన్నారు.  బడానేతలతో  సహా  అత్యధికుల  నియోజకవర్గాల్లో ప్రాథమిక  సభ్యత్వ  లక్ష్యాలూ అందుకోలేకపోతున్నారు. 2024  సార్వత్రిక ఎన్నికల్లో,  ఒక్కో లోక్​సభ  నియోజకవర్గం పరిధిలో పార్టీకి లభించిన ఓట్లలో  కనీసం 75 శాతం  సంఖ్యతో  సభ్యత్వాలుండాలని ముందు లక్ష్యంగా నిర్దేశించారు.  సాధ్యపడే సూచనలు కనిపించక, దాన్ని 50 శాతానికి తగ్గించి కొత్త లక్ష్యాలు నిర్దేశించారు. అవీ అందుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. లక్ష్యంగా  పెట్టుకున్న  మొత్తం  సభ్యత్వాల్లో  సగటున 55 శాతానికి చేరుకోగలిగినట్టు సమాచారం. 

 ఒకదశ సమాచారం ప్రకారం,  పార్టీ  శాసనసభాపక్షనేత మహేశ్వర్​రెడ్డి (నిర్మల్)  నియోజకవర్గంలో 29శాతం,  రాజాసింగ్ (గోషామహల్) 37శాతం, ఎంపీలు రఘునందన్​రావు (దుబ్బాక) 65శాతం,  డీకే అరుణ (గద్వాల) 22శాతం,  డా.లక్ష్మణ్ (ముషీరాబాద్) 46శాతం,  కేంద్రమంత్రులు బండి సంజయ్ (కరీంనగర్) 73శాతం,  కిషన్​రెడ్డి (అంబర్​పేట) 60శాతం మేరకు  సభ్యత్వ నమోదు లక్ష్యాలను పార్టీ సాధించింది.  గ్రామ, మండల,  జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎన్నికైన కమిటీలు ఏర్పడాల్సిన చోట  ‘నామినేటెడ్’  పంథాలో  సాగుతున్నాయని,  ఇది  సంస్థాగత స్వరూపాన్నే బలహీనపరుస్తోందనే ఆందోళన ఉంది. నాయకుల ఆధిపత్య పోరు పార్టీలో వైషమ్యాలకు కారణమౌతున్నట్టు దిగువశ్రేణి నాయకులు, కార్యకర్తలే చెబుతున్నారు. 

ఎటువంటి పార్టీ!  ఎందుకీ దుర్గతి?

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ‘ఈ సారి అధికారంలోకి వచ్చి తీరతాం’ అని బాహాటంగా బీజేపీ నాయకత్వం ప్రకటించింది.  అధ్వానపు  ఫలితాలతో  చతికిలపడి 8 చోట్ల మాత్రమే  నెగ్గింది.  ప్రపంచంలోనే అతిపెద్ద  రాజకీయ పార్టీ!   33 జిల్లాలు, 119 అసెంబ్లీ  నియోజకవర్గాలు, 17 లోక్​సభ  స్థానాలు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు, -వెనుక ప్రజాదరణ బీజేపీకి బాగానే ఉండేది.  ప్రజలు 2019 ఎన్నికల్లో 4 లోక్​సభ స్థానాల్లో గెలిపిస్తే, 2024 ఎన్నికల్లో  8 చోట్ల  గెలిపించారు.  ప్రజామొగ్గు ఒకోసారి అసాధారణ విజయాలను అందిస్తున్నా,  వాటిని సుస్థిరపరిచేలా  పార్టీ వ్యవస్థ బలోపేతం కావటంలేదు.

 నాయకుల మధ్య సయోధ్య,  సామరస్యం, ఉమ్మడి కృషి వంటివి లోపిస్తున్నాయి.  దీర్ఘకాలంగా  పార్టీలోనే ఉంటూ  ఎదిగిన తరానికి,  కొత్తగా పార్టీలోకి వచ్చి  స్థిరపడాలనుకుంటున్నవారికీ  మధ్య  ఘర్షణ  నిరంతరం  కొనసాగుతోంది.  నాయకుల మధ్య స్పర్థలు, పంతాలు, పట్టింపులు ఎక్కువై ప్రజాక్షేత్రంలో పార్టీ ముందుకు సాగటంలేదు.  కిషన్​రెడ్డి,  బండి సంజయ్  రాష్ట్రం నుంచి ఇద్దరికి  కేంద్ర మంత్రివర్గంలో  స్థానం దక్కినా.. ఆమేరకు  రాష్ట్రంలో  పార్టీ  బలపడుతున్న సంకేతాలు లేవు. కోటరీలు వ్యక్తిగత ఎజెండాలకే తప్ప పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది విమర్శ. 

మారిన సంస్కృతి

అంతర్గత క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి ఉన్న  ట్రాక్​ రికార్డు చెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీలో సహజమని చెప్పే గ్రూపులు, అసమ్మతి, ప్రత్యర్థులపై దుష్ప్రచారం, వ్యతిరేక కార్యకలాపాలు వంటివి బీజేపీలో పెరిగాయి. రాజకీయ లంచ్,  డిన్నర్  భేటీల కల్చర్ శృతిమించుతోంది. సొంత వ్యవహారాల మీద కన్నా ప్రత్యర్థి నేతలకు ‘చెక్’పెట్టడంపైనే  అధిక చర్చల ధోరణి బలపడుతోంది. రాష్ట్రంలో పార్టీ పటిష్టత, విస్తరణలో భాగంగా.. ఇతర పార్టీల నుంచి వలసల్ని అధినాయకత్వం ప్రోత్సహిస్తుంటే, సమన్వయ లోపం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి అదే గుదిబండలా మారుతోంది. బీజేపీలో పదవులు, హోదాలు పొందేవారు ఒకప్పుడు జనసంఘ్, ఆర్ఎస్ఎస్, భారతీయ మజ్దూర్​ సంఘ్, ఏబీవీపీ వంటి సంస్థలు- అనుబంధ విభాగాల నుంచి వచ్చే సంస్కృతి ఉండేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీల మూలాలతో వస్తున్నారనేది ఆరోపణ. 

బీజేపీ సిద్దాంతాలపై నిబద్ధతే కాకుండా అవగాహన కూడా లేని వారు పార్టీలోకి ‘వలస’ వస్తున్నారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొని, అయితే చట్టసభలకు, కాకుంటే వెనక్కి వెళ్లిపోతున్నారు. గెలిచి పదవులు, హోదాలు అనుభవించే కొందరు పార్టీ నిబద్ధత లేకుండా సొంతపనులు చక్కబెట్టుకుంటున్నారు. కాదని వెళ్లేవారు ఈలోపు పార్టీని విధ్వంసం చేస్తున్నారని అభియోగం!  అలాకాక, వచ్చి ఇక్కడే ఉండిపోతున్నవారికీ, పార్టీలోని పాత నేతలకూ పొసగటం లేదు. దీని వల్ల పార్టీ ప్రగతి ఒకడుగు ముందుకు పడితే పదడుగులు వెనక్కి పడుతున్నట్టుంది. ‘వాళ్లు సగం, వీళ్లు సగం (50–-50) అయినా పరవాలేదు, కానీ, 90-–10 నిష్పత్తి ఉంటే ఎట్లా?’ అని ఓ పాతతరం నేత వ్యక్తం చేసిన సందేహం సహేతుకమే! 

కొరవడ్డ రాజకీయ విధానం

పార్టీని నడపడంలోనే కాక, రాజకీయ వైఖరిలోనూ స్పష్టత కొరవడింది. దీనికి, పార్టీ ఢిల్లీ  నాయకత్వ ఉదాసీన ధోరణీ కారణమే! అసెంబ్లీ ఎన్నికల ముందు, బీఆర్ఎస్​తో  బీజేపీ అంటకాగుతోందన్న సంకేతాలు కొంపముంచాయి. ఇప్పుడు దానికి విరుద్ధ సంకేతాలూ పార్టీకి నష్టం చేసేవే!  కేంద్ర మంత్రులతో సహా రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్​ని లక్ష్యం చేసుకొని పదే పదే రాజకీయ విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు వారేం అధికారంలో లేరు. జాతీయ స్థాయిలో  పార్టీకి ప్రత్యర్థులైన కాంగ్రెస్ ఇక్కడ పాలకపక్షంగా ఉండి కూడా, ఏ విషయంలోనూ బీజేపీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదుర్కోవటం లేదు. ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు వారిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, కాంగ్రెస్​ను నెమెలీకలతో కొ ట్టడం బీజేపీ వ్యూహ వైఫల్యంగా కనిపిస్తోంది. ఫలితంగా, తెలంగాణలో పాలకపక్షంపై పోరాడే స్పేస్ బీజేపీ బదులు బీఆర్ఎస్ తీసుకుంటోంది.  

ఎవరి దారి వారిది

గుడి వివాదాన్ని తెరపైకి తెచ్చిన ఆందోళనలో బీజేపీ నేత ఒకరు కేంద్ర బిందువుగా ఉంటే,  నిరుద్యోగ యువత సమస్యను ఎత్తిచూపిన టీఎస్పీఎస్సీ ముందర ఆందోళనకు మరొకరు నేతృత్వం వహించారు. ఒకరి కార్యక్రమానికి వెళ్లద్దని మరొక గ్రూప్ సభ్యులకు ఆ నాయకత్వమే పరోక్షంగా సూచించడం పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముందున్నాయి.  స్థానికసంస్థల ఎన్నికలూ పార్టీ నాయకత్వానికి ఒక సవాలే!    ‘అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్​​లోనో అయినా బీజేపీ జెండా ఎగురుతుందేమో కానీ, తెలుగు రాష్ట్రంలో  బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ రాదు’ అని 1990లలో ఓ వృద్ద నాయకుడు, సిద్ధాంతకర్త అన్న మాటలు గుర్తుకురావటం అసంబద్ధమేం కాదు. కానీ, అవి తప్పని పార్టీ నాయకత్వం ఎప్పుడు రుజువు చేస్తుందో?  వేచి చూడాల్సిందే!

- దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్