జగదేవ్​పూర్​ ఐకేపీలో గ్రూప్​ విభేదాలు..పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన వివాదం

సిద్దిపేట/జగదేవ్ పూర్, వెలుగు: జగదేవ్ పూర్ మండల ఐకేపీలో గ్రూపు విభేదాలు గుప్పుమంటున్నాయి. కొంత కాలంగా అంతర్గతంగా సాగుతున్న విభేదాలు ఇటీవల పరస్పర ఫిర్యాదులతో బయటపడ్డాయి. ఐకేపీ ఏపీఎం కిరణ్​కుమార్, సీసీలు రమేశ్​రెడ్డి, బాబు తమను  లైంగికంగా వేధిస్తున్నారని సీఐటీయూ ఆధ్వర్యంలో కొందరు వీవోఏలు కలెక్టరేట్​లో ఫిర్యాదు చేయగా, తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీఎంతో పాటు సీసీలు జగదేవ్ పూర్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. జగదేవపూర్ మండల ఐకేపీలో ఒక ఏపీఎం, 8 మంది సీసీలు, 38 మంది వీవోఏలు పనిచేస్తుండగా వీరు 800 వందల మహిళ సంఘాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఐకేపీ ఉద్యోగులు, సిబ్బంది ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.

మెమోల జారీతో మొదలైన వివాదం? 

రివ్యూ మీటింగ్ లకు సక్రమంగా హాజరుకాని ఇద్దరు వివోఏలకు మెమోలు జారీ చేయడంతో వివాదం మొదలైంది. మహిళా సంఘాల నుంచి  రుణాల రికవరీ  సక్రమంగా వసూలు కాకపోవడంతో గ్రూప్ లు డిపాల్టర్ గా మారుతున్నాయి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కొందరు వీవోఏలకు సూచించినా రివ్యూ మీటింగ్ లకు హాజరు కాకపోవడంతో పాటు  ఏపీఏం, సీసీ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. వివోఏలుగా పనిచేస్తున్న మహిళల పట్ల సదరు ఉద్యోగులు లైంగికంగా వేధిస్తూ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఒంటరిగా రావాలని, పర్మిషన్ తీసుకుని పనులపై వెళ్తే లైవ్ లోకేషన్ పెట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. జగదేవ్ పూర్ ఐకేపీలో విభేధాలు రచ్చకెక్కి ఏకంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నా పై అధికారులు ఎలాంటి విచారణ జరపడం లేదు. తమ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేయడానికి కొందరు వీవోఏలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.