ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్​-3 ఎగ్జామ్

వెలుగు, నెట్​వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం మొదటి రోజు గ్రూప్–3 ఎగ్జామ్​ ప్రశాంతంగా జరిగాయి. అభ్యర్థులు 8 గంటల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు పరీక్ష కేంద్రాల సిబ్బంది హాల్ టికెట్లు, ఐడీ కార్డును పరిశీలించిన అనంతరం పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మహబూబ్​నగర్ లోని పలు సెంటర్లను కలెక్టర్​ విజయేందిర బోయి, ఎస్పీ ధరావత్​ జానకి పరిశీలించారు. పాలమూరు జిల్లాలోని 52 పరీక్ష కేంద్రాల్లో 19,465 అభ్యర్థులకు గాను ఫస్ట్​ పేపర్​కు10,646 మంది హాజరయ్యారని, 8,819 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్  తెలిపారు. రెండవ పేపర్ కు 1‌0,538 హాజరు కాగా, 8,927 మంది గైర్హాజయ్యారని చెప్పారు. 

ఒక్క నిమిషం నిబంధనతో 15 మంది అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది. నారాయణపేటలోని పలు సెంటర్లను కలెక్టర్  సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేశ్​​గౌతమ్  పరిశీలించారు. 4,024 మందికి గాను ఉదయం 2,353 మంది, మధ్యాహ్నం 2,354 మంది హాజరయ్యారు. గద్వాలలోని పలు సెంటర్లను కలెక్టర్  సంతోష్, ఎస్పీ శ్రీనివాస రావు ఎగ్జామ్​ సెంటర్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 25 సెంటర్లలో 8,570 మందికి గాను ఉదయం 4,789 మంది, మధ్యాహ్నం 4,785 మంది హాజరైనట్లు కలెక్టర్​ తెలిపారు. వనపర్తి జిల్లాలో నిమిషం నిబంధనతో ఏడుగురు అభ్యర్థులను అనుమతించలేదు. జిల్లాలో 8,312 మందికి గాను 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 4,612 మంది, మధ్యాహ్నం 4,611 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్  ఆదర్శ్  సురభి, ఎస్పీ రావుల గిరిధర్​ సందర్శించారు.

పోలీసుల ఔదార్యం.. 

పాలమూరు: మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్  గవర్నమెంట్​ ఉమెన్స్​ డిగ్రీ కాలేజీలో గ్రూప్--3 ఎగ్జామ్​ రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని లేట్​ అవుతుందని పరుగులు పెడుతూ కేంద్రం వరకు వచ్చి నీరసంతో కింద పడబోతుండగా స్పెషల్  బ్రాంచ్  ఏఎస్ఐ వెంకట్రాములు ఆమెను కింద పడిపోకుండా చూసి సెంటర్​లోకి పంపించారు. ఆ తరువాత మహిళా కానిస్టేబుల్​ ఆమెకు మంచినీళ్లు అందించారు. పొరపాటు వేరే సెంటర్​కు వెళ్లిన ఓ అభ్యర్థిని ట్రాఫిక్  హెడ్  కానిస్టేబుల్  యాదయ్య సకాలంలో సెంటర్​కు తీసుకొచ్చి సహకరించారు.