మెదక్​ జిల్లాలో గ్రూప్–2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

 

  • మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లాలో గ్రూప్​-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని  జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి అన్నారు.  బుధవారం తన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏఎస్పీ మహేందర్​, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హుస్సేన్​ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్​లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు గ్రూప్-–-2  రాత పరీక్ష బయోమెట్రిక్ పై  అవగాహన కల్పించారు.

 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  ఈ నెల 15,16వ  తేదీల్లో నిర్వహించబోయే  గ్రూప్–-2 పరీక్ష బయోమెట్రిక్​పై శిక్షణ నిర్వహించామన్నారు.  పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.  మెదక్​ జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  మొత్తం 5,856 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారన్నారు.  పోలీస్ బయోమెట్రిక్ ఆఫీసర్ (పీబీవో) మధుసూదన్ గౌడ్,  చీప్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.