గ్రూప్1 మెయిన్స్ కు 69.4 శాతం హాజరు : ప్రశాంతంగా ముగిసిన జనరల్ ఎస్సే ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్స్ రెండో రోజూ ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మూడు జిల్లాల పరిధిలో46 పరీక్షా కేంద్రాల్లో జనరల్ ఎస్సే పరీక్ష జరిగింది. దీనికి 31,403 మంది అభ్యర్థులకు గానూ 21,817  మంది హాజరయ్యారు. తొలిరోజు సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్ క్వాలిఫైయింగ్ టెస్టుకు 72.44 శాతం మంది హాజరు కాగా, మంగళవారం అది 69.4 శాతానికి తగ్గిపోయింది. జనరల్ ఎస్సే పేపర్ మాములుగా వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. మూడు సెక్షన్లతో కూడిన క్వశ్చన్ పేపర్ ఇవ్వగా, ఒక్కో సెక్షన్​లో మూడు క్వశ్చన్లు ఇచ్చారు. 

దీంట్లోంచి ఒక్కొక్కటి రాయాలి. ‘ఫస్ట్ సెక్షన్​లో సామాజిక అసమానతలను అధిగమించేందుకు ఆర్థికాభివృద్దే పరిష్కారమా?’ అని, ‘అసమాన అభివృద్ధి దేశంలో ప్రాంతీయవాదం పెరుగుదలకు దారితీసింది చర్చించండి’,  దేశంలో సరళీకరణ, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయి’ చర్చించండి అంటూ మూడు క్వశ్చన్లు ఇచ్చారు. దీంట్లో ఒక క్వశ్చన్ రాయాలి. రెండో సెక్షన్​లో రాజ్యాంగం ఉన్నా.. సామాజిక న్యాయం పలు సవాళ్లను ఎదుర్కొంటుందనే అంశంపై క్వశ్చన్ ఇచ్చారు. 

బౌద్దకళ అభివృద్ధిపై, జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణ విధానంపై, వాతావరణ మార్పులను తగ్గించడంలో పునర్ ఉత్పాదన ఇంధన పాత్ర, ప్రేరణ తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. అయితే వ్యాసాలను రాసేందుకు అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డట్టు చెప్తున్నారు. కొందరికి సమయం సరిపోలేదని పేర్కొంటున్నారు. కాగా, బుధవారం హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్ పేపర్–3 జరగనున్నది.