అప్పట్లో పవన్ను ఓడించిన గ్రంధి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. పెద్ద కథే ఉందిగా..!

అమరావతి: ఒకేరోజు వైసీపీకి షాకుల మీద షాకులు తగిలాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకూ రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు ఆయన పంపించారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ రాజీనామాతో వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్పై 8,357 ఓట్ల మెజారిటీతో గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. రెండు చోట్ల ఓడిన ఎమ్మెల్యేగా పవన్ను వైసీపీ శ్రేణులు ఆ సందర్భంలో ఎద్దేవా చేయడానికి గ్రంధి శ్రీనివాస్ విజయం కారణమైంది. పార్టీ కార్యక్రమాలకు గ్రంధి కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. దీంతో.. ఆయన వైసీపీని వీడే యోచనలో ఉన్నారని కొన్ని రోజుల క్రితమే ప్రచారం జరిగింది. వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా గ్రంధి హాజరుకాకపోవడంతో భీమవరం వైసీపీ కేడర్ ఆయనపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఆయనకు పోటీగా భీమవరం వైసీపీలో మరో వర్గం గ్రంధికి కొరకరాని కొయ్యగా తయారైంది. వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగిన సందర్భంలో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. 

గ్రంధిని బుజ్జగించేందుకు పేర్ని నానిని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు జగన్ రాయబారానికి పంపారు. ఈ ఇద్దరితో సమావేశమైనప్పటికీ గ్రంధి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు డిసెంబర్ 12న గ్రంధి శ్రీనివాస్ ప్రకటించడంతో ఆయన నిర్ణయమేంటో తేలిపోయింది. 2024 నవంబర్లో గ్రంధి శ్రీనివాస్ ప్రాపర్టీస్పై ఐటీ దాడులు జరిగాయి. భీమవరం, ఏలూరు, నాగాయలంక, సింగరాయకొండ, చెన్నైలోని గ్రంధి శ్రీనివాస్ ఇల్లు, తన బంధువుల ఇల్లు, భీమవరం, మచిలీపట్నం, ఏలూరులో తన బిజినెస్ పార్టనర్స్ ఆస్తులపై ఐటీ శాఖ రైడ్స్ జరిగాయి. కొన్ని కీలక డాక్యుమెంట్లను, కొంత మొత్తంలో డబ్బును, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, హార్డ్ డిస్కులను, బిజినెస్ రికార్డులను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేశారు. 

వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎదురుకావడం, రాజకీయంగా కూడా వైసీపీ ఓడిపోవడం.. ఈ రెండు పరిణామాలు గ్రంధి శ్రీనివాస్ను ఇబ్బందుల్లోకి నెట్టాయని, ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో చేరేందుకే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. కూటమి పార్టీల్లోని టీడీపీలో చేరతారా..? జనసేనలో చేరతారా..? అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. జనసేనలో చేరే ఆలోచనలో ఉంటే పవన్ను ఓడించి, ఆయన భంగపాటుకు గురికావడానికి కారణమైన గ్రంధిని ఎలా చేర్చుకుంటారనే వాదనను జనసేన కేడర్ తెరపైకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భవిష్యత్ కార్యాచరణపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఉత్కంఠ నెలకొంది.