కనులపండువగా తెప్పోత్సవం

  • అలంపూర్‌‌‌‌లో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

అలంపూర్, వెలుగు : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూర్‌‌‌‌లో జోగులాంబ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. విజయదశమిని పురస్కరించుకొని ఆలయ ఆవరణలోని శమీ వృక్షం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఈవో పురేందర్‌‌‌‌కుమార్‌‌‌‌ ఖడ్గంతో శమీ పత్రాన్ని కోసి స్వామికి సమర్పించారు. సాయంత్రం యోగా నరసింహస్వామి రథోత్సవం నిర్వహించారు. డీజీపీ జితేందర్, కలెక్టర్‌‌‌‌ సంతోష్‌‌‌‌, ఎమ్మెల్యే విజయుడు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

తుంగభద్రలో తెప్పోత్సవం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు. హంస వాహనంపై జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి నదీ విహారం కనులపండువగా సాగింది. జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పుష్కర ఘాట్‌‌‌‌కు తరలించారు. అక్కడ పూజల అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి నదీ విహారాన్ని కొనసాగించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై తెప్పోత్సవాన్ని వీక్షించారు.