ఇబ్రహీంపట్నంలో సందడిగా దీక్షాంత్ పరేడ్

ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని టీజీఎస్పీ 3వ బెటాలియన్​లో 2024 బ్యాచ్ ​స్టైఫండరీ క్యాడెట్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న 288 మంది కానిస్టేబుళ్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ​శివధర్ రెడ్డి గెస్ట్​గా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.

ఒకే బ్యాచ్​లో అన్నదమ్ములు

వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన రైతు పీరని పరశురాములు, మైభు దంపతుల కొడుకులు విజయ్, అజయ్ ఈ బ్యాచ్​లోనే ట్రైనింగ్​ పూర్తి చేసుకున్నారు. వీరు ఇంటర్ వరకు చదివారు. పరశురాములు పెద్దకొడుకు గతంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించి వెనకడుగు వేశాడు. దీంతో అజయ్, విజయ్​ ఎంపికై అన్న కలను నెరవేర్చారు. ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుతూ.. తాను చదువుకోలేదని, కానీ తన కొడుకులను చదివించానని చెప్పాడు. వారిప్పుడు కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.

అతడి వెనుక ఆమె..

జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుంతల గ్రామం వ్యవసాయ కుటుంబానికి చెందిన సతీశ్ కు పెండ్లై ఇద్దరు పిల్లలున్నారు. కష్టపడి చదివి కానిస్టేబుల్​గా సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అందుకు తన భార్య, తల్లిదండ్రుల సహకారం ఉంతో ఉందన్నారు.

అమ్మ కష్టం తెలుసుకొని.... 

వరంగల్ జిల్లా ఫాతిమా నగర్​కు చెందిన రోజూవారీ కూలి ఏడెల్లి పద్మ. ఆమెకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, భర్త 10 ఏండ్ల కింద మృతి చెందారు. అయినప్పటికీ కష్టపడి కుమార్తె పెండ్లి చేసింది. తన ఇద్దరు కొడుకులు ఏడెల్లి శ్రీకాంత్ బీటెక్ చదవగా, ప్రశాంత్ లాబ్ టెక్నీషియన్ చదువుకున్నారు. తన బిడ్డలు తన కష్టం తెలుసుకొని బాగా చదివి కానిస్టేబుళ్లు అయ్యారని పద్మ సంతోషం వ్యక్తం చేశారు.